ఒకప్పుడు హాకీ అంటే మన జాతీయ గర్వానికి ప్రతీక. ఆ హాకీ స్టిక్‌తో మన ప్లేయర్లు ప్రపంచాన్ని శాసించారు. వరుస ఒలింపిక్ గోల్డ్ మెడల్స్‌తో మన జెండాను రెపరెపలాడించారు. ఆ స్వర్ణయుగం నుంచి, మధ్యలో కాస్త ఒడుదొడుకులు ఎదుర్కొన్నా, మళ్లీ ఫామ్‌లోకి వచ్చి టోక్యోలో 41 ఏళ్ల కలను నిజం చేసుకున్నారు. భారత్‌లో హాకీ ప్రయాణానికి సరిగ్గా 100 ఏళ్లు నిండాయి. నవంబర్ 7తో భారత హాకీకి వందేళ్లు పూర్తయ్యాయి. హాకీ.. క్రీడా సంస్కృతే లేని భారత దేశాన్ని ఒలింపిక్స్ మెరుపులతో అగ్రస్థానంలో నిలిపింది. ఇప్పుడంటే క్రికెట్ మాయలో పడి దీన్ని మర్చిపోయాం కానీ ఒకప్పుడు హాకీ ఈ దేశపు గుండె చప్పుడు. మేజర్ ధ్యాన్‌చంద్, బల్బీర్ సింగ్ సీనియర్, ధన్‌రాజ్ పిళ్లై వంటి దిగ్గజాలను ప్రపంచానికి పరిచయం చేసింది. భారత హాకీ జట్టు అంతర్జాతీయ హాకీ(1925-2025)లో అడుగు పెట్టి నేటికి వందేళ్లు పూర్తయింది. ఒలింపిక్స్ గ్లోబల్ ఈవెంట్ కనుక అన్ని ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం ఉండేందుకు ఒక్కో రీజియన్ నుంచి ఒక్కో జట్టును ఎంపిక చేసి క్వాలిఫయర్ రౌండ్ నిర్వహించే అవకాశం ఉంది. ఇండియన్ హాకీ ఫెడరేషన్ (IHF) ఏర్పడి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఈ వేడుకలను హాకీ ఇండియా (HI) దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించింది. దేశంలోని 550కి పైగా జిల్లాల్లో ఏకకాలంలో ఈ వేడుకలు నిర్వహించారు. 1400లకు పైగా హాకీ మ్యాచ్‌లు నిర్వహించగా 36,000 మందికి పైగా ప్లేయర్లు పాల్గొన్నారు. 1850లో ఆంగ్లేయులు భారత్‌కు హాకీని పరిచయం చేశారు. దాదాపు 75 ఏళ్ల తర్వాత.. 1925 నవంబర్‌లో భారత హాకీకి తనకంటూ ఓ పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడం కోసం కొంత మంది వ్యక్తులు గ్వాలియర్‌లో సమావేశం అయ్యారు. అలా మొదలైందే ఇండియన్ హాకీ ఫెడరేషన్(ఐహెచ్ఎఫ్).
అది హాకీ స్వర్ణయుగం
1925లో ఇండియన్ హాకీ ఫెడరేషన్ ఏర్పడిన మూడేళ్లకే, అంటే 1928 ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్‌లో మన టీమ్ తొలిసారి అడుగుపెట్టి, ఏకంగా గోల్డ్ మెడల్ కొట్టింది. అక్కడి నుంచి 1980 వరకు మనది తిరుగులేని స్వర్ణయుగం. ఈ కాలంలో ఇండియా ఏకంగా 13 ఒలింపిక్ పతకాలు సాధించింది. అందులో 8 స్వర్ణాలు (1928, 1932, 1936లలో హ్యాట్రిక్), 1 రజతం, 4 కాంస్యాలు ఉన్నాయి. ధ్యాన్ చంద్, బల్బీర్ సింగ్ వంటి లెజెండ్స్... హాకీని మన జాతీయ గుర్తింపుగా మార్చేశారు. 1980 మాస్కో ఒలింపిక్స్ మన చివరి స్వర్ణం. 1980ల తర్వాత, ఆర్టిఫిషియల్ టర్ఫ్ రాకతో మన హాకీ కాస్త వెనకబడింది. 41 ఏళ్ల పాటు ఒలింపిక్ పతకానికి దూరమయ్యాం. కానీ, 2009లో 'హాకీ ఇండియా' ఏర్పడటం, 'హాకీ ఇండియా లీగ్' (HIL) రాకతో సీన్ మారింది. టోక్యో 2020లో మన కుర్రాళ్లు కాంస్య పతకం గెలిచి, 41 ఏళ్ల కలను నిజం చేశారు. ఈ విజయాలతో ఇండియాలో హాకీ మళ్లీ గాడిలో పడింది. ఈ 100 ఏళ్ల వేడుక ఒక ముగింపు కాదు, కొత్త శకానికి ఆరంభం అని హాకీ ఇండియా ప్రెసిడెంట్ దిలీప్ టిర్కీ అన్నారు. రూట్ లెవెల్ నుంచి కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ, మళ్లీ వరల్డ్ హాకీలో టాప్ ప్లేస్‌కు చేరడమే లక్ష్యంగా ఇండియా పక్కా ప్లాన్‌తో ఉంది. హాకీలో భారత్ ప్రదర్శించిన ఆధిపత్యం మరే క్రీడలోనూ ప్రదర్శించలేదంటే అతిశయోక్తి కాదు. 1926లో తన తొలి అంతర్జాతీయ పర్యటనలో భారత్.. న్యూజిలాండ్‌లో 21 మ్యాచ్‌ల్లో 18 గెలిచింది. హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్ అరంగేట్రం చేసింది ఇక్కడే.