T20 worldcup: శాంసన్ నిలిచెన్.. భారత్ గెలిచెన్

సంజు శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్‌... టీ 20 ప్రపంచకప్ సెమీస్‌కు భారత్.. 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదన

Update: 2026-03-02 02:30 GMT

టీ20 ప్రపంచకప్ వేదికగా మరోసారి భారత జట్టు తన అసలైన సత్తాను చాటుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన కీలక పోరులో వెస్టిండీస్‌పై ఐదు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన టీమిండియా సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది. కోల్‌కతా మైదానం సాక్షిగా జరిగిన ఈ మ్యాచ్ అభిమానులకు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ అందించింది. భారీ లక్ష్యాన్ని ఎదుర్కొన్నప్పటికీ ఒత్తిడికి లోనుకాకుండా ఆడిన భారత బ్యాటర్లు జట్టుకు గుర్తుండిపోయే విజయాన్ని అందించారు. ముఖ్యంగా సంజు శాంసన్ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ ఈ మ్యాచ్‌ను మరింత ప్రత్యేకంగా నిలిపింది. మొదట టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ జట్టు ప్రారంభం నుంచే దూకుడుగా ఆడింది. షై హోప్ (32), రోస్టన్ ఛేజ్ (40) జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. మధ్య ఓవర్లలో షిమ్రాన్ హెట్మయెర్ (27), షెర్ఫానె రూథర్ఫోర్డ్ (14) వేగంగా పరుగులు జోడించారు. చివరి దశలో రోమన్ పావెల్ (34*), జాసన్ హోల్డర్ (37*) దూకుడుగా ఆడడంతో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా, వరుణ్ ఒక్కో వికెట్ సాధించారు. విండీస్ బ్యాటింగ్ లోతు మరియు పవర్ హిట్టింగ్ భారత్‌కు సవాలుగా మారింది.196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభం మాత్రం ఆశించినంతగా రాలేదు.

శాంసన్ వీరోచిత పోరాటం

అభిషేక్ శర్మ (10), ఇషాన్ కిషన్ (10) త్వరగా అవుట్ కావడంతో జట్టు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్ ఇన్నింగ్స్‌కు మద్దతుగా నిలిచాడు. అతనికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (18) తోడయ్యాడు. ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్‌ను స్థిరపరిచే ప్రయత్నం చేశారు. అయితే సూర్యకుమార్ త్వరగా అవుట్ కావడంతో మరోసారి ఒత్తిడి పెరిగింది. సంజు శాంసన్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. విండీస్ బౌలర్లపై దూకుడుగా ఆడుతూ మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. కేవలం 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 97 పరుగులు చేసి చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఛేజింగ్‌లో ఒక భారత బ్యాటర్ చేసిన అత్యధిక స్కోరుగా శాంసన్ కొత్త రికార్డు నెలకొల్పాడు. అతని టైమింగ్, షాట్ సెలెక్షన్, ఒత్తిడిని ఎదుర్కొనే ధైర్యం అభిమానులను ముగ్ధులను చేసింది. యువ ఆటగాడు తిలక్ వర్మ కూడా కీలక సమయంలో 15 బంతుల్లో 27 పరుగులు చేసి జట్టుకు ఊతమిచ్చాడు. నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో తిలక్ వేగంగా స్కోరు పెంచాడు. హార్దిక్ పాండ్యా (17) కొంతకాలం పాటు శాంసన్‌కు తోడుగా నిలిచినా కీలక సమయంలో అవుట్ అయ్యాడు. చివర్లో శివం దూబే (8*) వరుసగా రెండు ఫోర్లు బాది ఒత్తిడిని తగ్గించాడు.

చివరి ఓవర్‌లో భారత్‌కు 7 పరుగులు అవసరమైన పరిస్థితి నెలకొంది. రొమారియో షెపర్డ్ బౌలింగ్‌కు వచ్చాడు. అయితే శాంసన్ తన క్లాస్‌ను చూపించాడు. ఒక అద్భుత సిక్సర్, వెంటనే ఫోర్ బాది మ్యాచ్‌ను ముగించాడు. 19.2 ఓవర్లలో 199 పరుగులు చేసి భారత్ విజయం సాధించింది. భారీ లక్ష్యాన్ని ఛేదించిన భారత్ తన బ్యాటింగ్ బలం, ఒత్తిడిని ఎదుర్కొనే నైపుణ్యాన్ని మరోసారి నిరూపించింది. సెమీఫైనల్‌కు అర్హత సాధించిన టీమిండియా ఇక టైటిల్ దిశగా మరింత దూకుడుగా ముందుకు సాగనుంది.

Tags:    

Similar News