ICC: బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న ఐసీసీ

టీ 20 ప్రపంచకప్ నేపథ్యంలో ప్రాధాన్యం

Update: 2026-01-17 04:30 GMT

అంతర్జాతీయ క్రికెట్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. భద్రతా పరిస్థితులు, రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ఐసీసీ త్వరలోనే బంగ్లాదేశ్తో క్రికెట్ బోర్డుతో నేరుగా బంగ్లాదేశ్‌లో సమావేశం నిర్వహించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ భేటీ అనంతరం 2026 టీ20 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ జట్టు ఆడాల్సిన మ్యాచ్‌ల వేదికలపై ఐసీసీ కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో వరల్డ్‌కప్ ఏర్పాట్లపై మళ్లీ ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఐసీసీ, బీసీబీ మధ్య ఈ అంశంపై వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. అయితే, బంగ్లాదేశ్ టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరత, భద్రతా సమస్యలు ఐసీసీని ఆలోచనలో పడేస్తున్నాయి. గత కొంతకాలంగా ఆ దేశంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, అంతర్గత పరిస్థితులు అనిశ్చితంగా మారడం క్రికెట్ నిర్వహణపై ప్రభావం చూపుతున్నాయి.

భద్రతాపరమైన ఆందోళనలు 

ఈ నేపథ్యంతో పాటు, బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుస దాడులు జరుగుతున్నాయనే వార్తలు అంతర్జాతీయంగా చర్చకు దారి తీశాయి. భద్రతాపరమైన ఆందోళనలు పెరగడంతో, అక్కడ అంతర్జాతీయ ఈవెంట్ల నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల మధ్యే బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ను ఐపీఎల్ మినీ వేలంలోకోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.9.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో, భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదేశాలతో కేకేఆర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను విడుదల చేయాల్సి వచ్చింది. భద్రతా పరిస్థితులు, ప్రభుత్వ ఆంక్షలు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన బంగ్లాదేశ్‌లో మరింత రాజకీయ, క్రీడా చర్చలకు దారితీసింది. ఈ పరిణామాల అనంతరం బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సంచలనంగా మారింది. దీనితో క్రికెట్ మాత్రమే కాదు, క్రీడలతో ముడిపడ్డ దౌత్య సంబంధాలపై కూడా ప్రభావం పడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో, టీ20 వరల్డ్‌కప్ 2026లో భద్రతా కారణాల దృష్ట్యా తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు తరలించాలని ఐసీసీకి బంగ్లాదేశ్ లేఖ రాసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ అంశంపై ఐసీసీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. ఈలోగా బీసీబీ నాలుగు సార్లు ఐసీసీకి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. భద్రతే ప్రథమ ప్రాధాన్యమని, ఆటగాళ్లకు ఎలాంటి ప్రమాదం లేకుండా మ్యాచ్‌లు నిర్వహించాల్సిన బాధ్యత ఐసీసీపై ఉందని బంగ్లాదేశ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

షెడ్యూల్ ప్రకారం 2026 టీ20 వరల్డ్‌కప్ ఫిబ్రవరి 7న ప్రారంభం కానుంది. గ్రూప్ స్టేజ్‌లో బంగ్లాదేశ్ జట్టు తన మ్యాచ్‌లను భారత్‌లో ఆడాల్సి ఉంది. ఫిబ్రవరి 7న వెస్టిండీస్‌తో, ఫిబ్రవరి 9న ఇటలీతో, ఫిబ్రవరి 14న ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లు కోల్‌కతాలో వేదికగా జరగాల్సి ఉంది. అదేవిధంగా ఫిబ్రవరి 17న నేపాల్‌తో మ్యాచ్ ముంబయిలో నిర్వహించాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ షెడ్యూల్ యథాతథంగా కొనసాగుతుందా? లేక వేదికలు మారుతాయా? అన్న ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకలేదు. ఐసీసీ బంగ్లాదేశ్ పర్యటన తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటంతో, అంతర్జాతీయ క్రికెట్ వర్గాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.

Tags:    

Similar News