ASIA GAMES: భారత్ ఖాతాలో మరో రెండు స్వర్ణాలు
టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్న-రుతుజా భోసలే జోడీకి స్వర్ణం... పురుషుల స్క్వాష్‌లోనూ పసిడి పతకం...;
ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో రెండు స్వర్ణాలు, 2 రజతాలు, ఓ కాంస్యం దక్కాయి. టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న, రుతుజా భోసలే జోడీ స్వర్ణ పతకం సాధించింది. ఈ జోడీ 2-6, 6-3, 10-4 తేడాతో.. చైనీస్ తైపీ జోడీ సుంగ్ హావ్ హువాంగ్ , ఎన్ షోవ్ లియాంగ్ పై విజయం సాధించింది. పురుషుల స్క్వాష్‌లో భారత జట్టు పాక్‌పై గెలుపొంది స్వర్ణం దక్కించుకుంది. ఈ పోటీలో అభయ్ సింగ్ , సౌరవ్ ఘోషల్‌తో కూడిన భారత జట్టు పాక్‌పై జయభేరి మోగించి దేశానికి పసిడి పతకం అందించారు.
పది మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ మిక్స్ డ్ టీం విభాగంలో సరబ్ జ్యోత్-దివ్య జోడీ రజత పతకం సాధించింది. కేవలం రెండు పాయింట్ల తేడాతో స్వర్ణ పతకం కోల్పోయింది. భారత్ జోడీ 14పాయింట్లు సాధించి రెండోస్థానంలో నిలిచింది. పదివేల మీటర్ల పరుగులో భారత రన్నర్ కార్తీక్ కుమార్ రజతం గెలిస్తే గుల్వీర్ సింగ్ కాంస్యపతకం తన ఖాతాలో వేసుకున్నాడు. పది వేల మీటర్ల దూరాన్ని కార్తీక్ 28 నిమిషాల 15 సెకన్ల 38 మైక్రో సెకన్లలో పూర్తి చేస్తే గుల్వీర్ 28 నిమిషాల 17 సెకన్ల 21 మైక్రో సెకన్లలో ముగించాడు.
మరోవైపు భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు ఆసియా క్రీడల టీమ్ ఈవెంట్‌లో తొలిసారి ఫైనల్లోకి అడుగు పెట్టింది. తద్వారా మొదటి స్వర్ణం గెలిచేందుకు మరో అడుగు దూరంలో నిలిచింది. సెమీ ఫైనల్లో భారత్ 3–2 తేడాతో దక్షిణ కొరియాను ఓడించింది. అనూహ్యంగా కొరియా నుంచి భారత్‌కు తీవ్ర ప్రతిఘటన ఎదురు కావడంతో పోరు హోరాహోరీగా సాగిన చివరి మ్యాచ్ వరకు వెళ్లింది. పురుషుల తొలి సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ 18–21, 21–16, 21–19తో జీన్ హ్యోక్ జీన్‌పై విజయం సాధించగా, పురుషుల డబుల్స్‌లో టాప్ జోడి సాతి్వక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టిపై 21–13, 26–24తో కాంగ్ మిన్ హ్యూక్ – స్యూంగ్ జే సంచలన విజయం సాధించారు.
రెండో సింగిల్స్‌లో లక్ష్య సేన్ 21–7, 2–19తో లీ యూన్ గ్యూను చిత్తుగా ఓడించినా... రెండో డబుల్స్‌లో ఎంఆర్ అర్జున్ – ధ్రువ్ కపిల 16–21, 11–21తో కిమ్ వోన్ హో – సంగ్ సియూంగ్ చేతిలో పరాజయంపాలైంది. దాంతో భారత్‌ను గెలిపించాల్సిన బాధ్యత కిదాంబి శ్రీకాంత్‌పై పడింది. తొలి గేమ్‌ను అతనూ ఓడిపోవడంతో కొంత ఉత్కంఠ పెరిగింది. అయితే చివరకు 12–21, 21–16, 21–14తో చో జియోనిప్‌పై శ్రీకాంత్ గెలుపొందాడు.
హాకీ జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను బలంగా దెబ్బ కొట్టింది. పూల్ ఎ మ్యాచ్‌లో భారత్ 10–2 గోల్స్ తేడాతో పాక్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. అంతర్జాతీయ హాకీలో పాక్‌పై భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం. 2017లో నమోదు చేసిన 7–1 స్కోరును భారత్ ఇక్కడ తిరగరాసింది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ నాలుగు గోల్స్‌తో చెలరేగాడు.