India vs Ireland 3rd T20I: క్లీన్‌స్వీప్‌పై బుమ్రా సేన కన్ను

ఐర్లాండ్‌తో నేడు ఆఖరి టీ 20 మ్యాచ్‌... ఇప్పటికే సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా;

Update: 2023-08-23 02:00 GMT

  ఐర్లాండ్‌తో టీ 20 సిరీస్‌‍(India vs Ireland 3rd T20I)లో క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన టీమిండియా ఆఖరి పోరుకు సిద్ధమైంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న బుమ్రా సేన.. చివరి మ్యాచ్‌లోనూ నెగ్గి క్లీన్‌స్వీప్‌ చేయాలని భావిస్తోంది. రిజర్వ్‌ ఆటగాళ్లను పరీక్షించేందుకు ఈ నామమాత్రమైన మ్యాచ్‌ను వినియోగించుకోవాలని టీమ్‌ఇండియా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటివరకూ భారత్‌తో ఆడిన పది మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైన ఐర్లాండ్‌(India and Ireland)... సొంతగడ్డపై ఈ మ్యాచ్‌లోనైనా గెలవాలని పట్టుదలగా ఉంది. ఈ సిరీస్‌తో గాయాల నుంచి కోలుకుని పునరాగమనం చేసిన పేస్‌ బౌలర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ట ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడంపై మేనేజ్‌మెంట్‌ సంతోషంగా ఉంది.


 ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ కెప్టెన్‌ బుమ్రా(India's captain Jasprit Bumrah), పేసర్‌ ప్రసిధ్‌ కృష్ణ(Prasidh Krishna) ఫామ్‌లోకి రావడం, ఆసియా కప్‌నకు ఎంపిక కావడంతో ఈ సిరీస్‌ నుంచి భారత్‌కు ఆశించిన ప్రధాన ఫలితం దక్కింది. ఆసియాకప్‌కు ముందు కెప్టెన్‌ బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ణ మరింత మ్యాచ్‌ టైమ్‌ కోరుకుంటున్న నేపథ్యంలో వారికి విశ్రాంతినిచ్చే అవకాశం లేదు. రవి బిష్ణోయ్‌ కూడా సిరీస్‌లో తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్‌లో రుతురాజ్, సామ్సన్, రింకూ సింగ్‌ కూడా తమ అవకాశాలను చక్కగా ఉపయోగించుకోగా, శివమ్‌ దూబే కూడా తన ధాటిని ప్రదర్శించాడు. అవేష్‌ ఖాన్‌(Avesh Khan), జితేశ్‌ శర్మ(Jitesh Sharma), షాబాజ్‌ అహ్మద్‌(Shahbaz Ahmed) ఇప్పటివరకు సిరీస్‌లో ఆడలేదు. అవేష్‌ వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో బెంచ్‌కు పరిమితం కావాల్సివచ్చింది. ఈ నేపథ్యంలో నిలకడగా రాణించలేకపోతున్న అర్ష్‌దీప్‌ సింగ్‌(Arshdeep Singh) స్థానంలో అతణ్ని తుది జట్టులోకి తీసుకునే అవకాశముంది. సంజు శాంసన్‌(Sanju Samson)కు విశ్రాంతినిచ్చి వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ జితేశ్‌ శర్మకు అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వొచ్చు.


సిరీస్‌లో విఫలమైన తిలక్‌ వర్మ చివరి పోరులో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. దేవధర్‌ ట్రోఫీలో విశేషంగా రాణించి ఆత్మవిశ్వాసంతో ఉన్న షాబాజ్‌ అహ్మద్‌ భారత్‌కు మరో ఆల్‌రౌండ్‌ ప్రత్యామ్నాయం. వాషింగ్టన్‌ సుందర్‌కు విశ్రాంతి కల్పించి షాబాజ్‌ను ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఇక సంజు స్థానంలో జితేశ్‌ను ఆడించడం మినహా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు ఉండే వీలు లేదు. రెండో టీ20తో అరంగేట్రం చేసిన రింకూ 21 బంతుల్లో 38 పరుగులతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

ఐర్లాండ్‌ పోరాడుతున్న అది టీమిండియా ముందు సరిపోవడం లేదు. ప్రపంచవ్యాప్తంగా లీగ్‌లలో అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తూ వచ్చిన కెప్టెన్‌ పాల్‌ స్టిర్లింగ్‌ రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమయ్యాడు. బల్బిర్నీ మినహా మిగతావారంతా ప్రభావం చూపలేకపోయారు. ఐర్లాండ్‌ తరఫున ఎడమచేతి వాటం స్పిన్నర్‌ వాన్‌ వోర్కమ్‌ అరంగేట్రం చేయొచ్చు. తిరుగులేని ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న భారత్‌ను క్లీన్‌స్వీప్‌ చేయకుండా అడ్డుకోవడం ఐర్లాండ్‌కు కష్టమైన పనే. వాతావరణం మబ్బు పట్టి ఉంటుంది. ఆటకు వర్షం అంతరాయం కలిగించే అవకాశముంది. కానీ మ్యాచ్‌ పూర్తిగా జరగొచ్చు. రాత్రి ఏడున్నరకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

Tags:    

Similar News