Cricket : రెండో వన్డేలో భారత్ ఓటమి .. 76 పరుగుల తేడాతో కివీస్ గెలుపు

Update: 2024-10-28 06:15 GMT

న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భారత మహిళల జట్టుకు షాక్ తగిలింది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో కివీస్‌ చేతిలో 76 పరుగుల తేడాతో భారత్ ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది.ఓపెనర్లు సుజీ బేట్స్‌ (58; 70 బంతుల్లో 8 ఫోర్లు), జార్జియా ప్లిమ్మర్ (41; 50 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌), సోఫీ డివైన్ (79; 86 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌కు తోడు మ్యాడీ గ్రీన్ (42; 41 బంతుల్లో 5 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో రాధా యాదవ్ 4, దీప్తి శర్మ 2, ప్రియా మిశ్రా, సైమా ఠాకూర్‌ తలో వికెట్ పడగొట్టారు. తర్వాత లక్ష్య ఛేదనలో టాప్‌ ఆర్డర్ పూర్తిగా తేలిపోవడంతో టీమిండియా 47.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. షెఫాలి వర్మ (11), యాస్తికా భాటియా (12), జెమీమా రోడ్రిగ్స్‌ (17), తేజల్ హసబ్నిస్ (15), దీప్తి శర్మ (15)లు విఫలమయ్యారు. దీంతో 108 పరుగులకే 8 వికెట్లు కోల్పోవడంతో భారత్‌కు ఘోర పరాభవం తప్పదనిపించింది. ఈ క్రమంలో తొమ్మిదో స్థానంలో వచ్చిన రాధా యాదవ్ (48; 64 బంతుల్లో 5 ఫోర్లు), సైమా ఠాకూర్‌ (29) సహకారంతో నిలకడగా ఆడింది. ఈ జోడీ తొమ్మిదో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్‌ను ఘోర ఓటమి నుంచి కాపాడింది. ఈ మ్యాచ్‌లో కివీస్‌ గెలుపొందడంతో సిరీస్‌ 1-1తో సమం అయింది. సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌ అహ్మదాబాద్‌లోనే మంగళవారం (అక్టోబర్ 29) జరగనుంది.

Tags:    

Similar News