Common Wealth Games : 27 పతకాలతో ఆరవ స్థానంలో భారత్..

Common Wealth Games : ఇంగ్లండ్ బర్మింగ్‌హమ్‌ వేదికగా కొనసాగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత పతకాల వేట కొనసాగుతోంది.

Update: 2022-08-06 03:45 GMT

Common Wealth Games : ఇంగ్లండ్ బర్మింగ్‌హమ్‌ వేదికగా కొనసాగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత పతకాల వేట కొనసాగుతోంది. ఎనిమిదవ రోజు భారత అథ్లెట్లు పతకాల పంట పండించారు. భారత రెజ్లర్లు పసిడి పతకాలను ఒడిసి పట్టారు. స్టార్‌ రెజ్లర్‌ దీపక్‌ పునియా మెన్స్‌ 66 కేజీల విభాగంలో పాకిస్థాన్‌కు చెందిన ముహమ్మద్ ఇనామ్‌ను ఓడించి బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. ఇక విమెన్స్‌ రెజ్లింగ్‌ ఫ్రీస్టైల్ 62 కేజీల విభాగంలో సాక్షి మాలిక్‌ గోల్డ్ మెడల్ గెలిచింది. భారత స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పునినియా ఫైనల్స్‌లో కెనడా రెజ్లర్‌ మెక్‌నీల్‌పై అలవోక విజయం సాధించాడు.

బజరంగ్‌ పునియా కామన్వెల్త్ గేమ్స్‌లో తన అధిపత్యాన్ని కొనసాగించగా...సాక్షి మాలిక్‌, దీపక్ పునియాలు మొదటి సారి కామన్వెల్త్ పతకాలు సాధించారు. మహిళల 68 కిలోల ఫ్రీ స్టైల్‌ రెజ్లింగ్ విభాగంలో దివ్య కాక్రన్ కాంస్య పతకం సాధించింది.

మరో భారత రెజ్లర్‌ అన్షు మాలిక్‌ మహిళల 57 కేజీల విభాగంలో రజత పతకం సాధించింది. ఫైనల్‌లో నైజిరియా రెజ్లర్‌ చేతిలో ఓడిపోయింది. కామన్వెల్త్‌ గేమ్స్‌లో అన్షుకు ఇదే ఫస్ట్ మెడల్‌. ఇక మెన్స్‌ 125 కేజీల రెజ్లింగ్ విభాగంలో మోహిత్‌ గ్రెవాల్‌ కాంస్య పతకం సాధించాడు. ఇక పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ లో సుధీర్ స్వర్ణం గెలుచుకున్నాడు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో పారా పవర్ లిఫ్టింగ్ స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా సుధీర్ చరిత్ర సృష్టించాడు. తొలిప్రయత్నంలోనే 208 కేజీల బరువెత్తిన సుధీర్‌.. రెండో ప్రయత్నంలో 212 కిలోలు ఎత్తాడు.

భారత అథ్లెట్ల ప్రదర్శనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. హాకి సెమీఫైనల్‌లో భారత మహిళ జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఇవాళ కాంస్య పతకం కోసం మ్యాచ్ ఆడనుంది. ఇక 200 మీటర్ల విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించడంలో హిమదాస్ విఫలమైంది.

ఇక మొత్తం 27 పతకాలతో భారత్ ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇందులో 9 గోల్డ్ మెడల్స్ ఉండగా..8 రజతాలు, 9 కాంస్య పతకాలున్నాయి. మొత్తం 140 పతకాలతో ఆస్ట్రేలియా టేబుల్ టాపర్‌గా ఉండగా..131 పతకాలతో ఇంగ్లండ్ తర్వాతి స్థానంలో ఉంది.

Tags:    

Similar News