ఫుట్‌బాల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో పోరు, భారత్‌దే పైచేయి..
భారత్ ఫుట్‌బాట్ ఏస్ ప్లేయర్, కెప్టెన్ హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిశాడు.;
ప్రపంచ క్రీడారంగంలోకి దాయాదులు ఎంతమంది ఉన్నా భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరిగే క్రీడలకు ఉన్న క్రేజే వేరు. ఈ రెండు జట్ల మధ్య ఆట ఉంటే ఆటగాళ్లు, అభిమానుల భావోగ్వేదాలు పీక్స్‌లో ఉంటాయి. నిన్న జరిగిన శాఫ్ ఛాంపియన్‌షిప్‌లో చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్‌పై 4-౦ గోల్స్ తేడాతో పాకిస్థాన్‌ని మట్టికరిపించి తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. భారత స్టార్ ఆటగాడు, కెప్టెన్ సునీల్ ఛెత్రి హ్యాట్రిక్ గోల్స్‌తో అదరగొట్టాడు.
ఆటగాళ్ల మధ్య గొడవ..
భారత్, పాక్ మధ్య మ్యాచ్ అంటే భావోద్వేగాలు ఏ స్థాయిలో ఉంటాయో అందరికీ తెలిసిందే. ఫస్ట్ హాఫ్ ముగుస్తుందనే సమయంలో ఇరుజట్ల చిన్నగొడవ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. పాక్ ఆటగాడు బంతి విసురుతుండగా, భారత్ కోచ్ ఇగార్ స్టిమాక్ చేత్తో నెట్టేశాడు. దీంతో భారత్, పాక్ ఆటగాళ్లు పరస్పరం వాదించుకుంటూ నెట్టుకున్నారు. దీంతో మ్యాచ్ రిఫరీ భారత కోచ్ ఇగార్ స్టిమాక్‌కు రెడ్ కార్డ్ చూయించాడు.
భారత్‌దే పైచేయి..
దాయాదుల మధ్య క్రికెట్, హాకీ మ్యాచ్‌లకు భారత్‌లో ఆదరణగా ఎక్కువ. వాటిలో గెలుపోటములు కూడా అటూ ఇటూగానే ఉంటాయి. కానీ ఫుట్‌బాట్‌లో మాత్రం భారత్‌దే పైచేయి. ఇరుజట్లు పలు పోటీల్లో ఆడిన 29 మ్యాచుల్లో 16 విజయాలతో భారత్ అప్రతిహంగా రికార్డు కొనసాగిస్తోంది. 4 మ్యాచుల్లో మాత్రమే పాక్ గెలవగా, మరో 9 మ్యాచులు డ్రాగా ముగిశాయి.
శాఫ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో 9 సార్లు తలపడగా, 1993 లో తలపడ్డ తొలి మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. మిగిలిన దాంట్లో 7 సెమీఫైనల్స్‌తో సహా 7 మ్యాచుల్లో భారత్ విజయం సాధించగా, పాక్ 1 మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది.
భారత్ ఫుట్‌బాల్ అంటే ఛెత్రీనే..
భారత ఫుట్‌బాల్ అంటే సునీల్ ఛెత్రీనే అనేంతగా తన ముద్ర వేశాడు ఈ ఏస్ ప్లేయర్. చాలా సంవత్సారాల నుంచి భారత ఫుట్‌బాల్‌ను తన భుజస్కందాల మీద మోస్తూ భారత ఫుట్‌బాల్‌కు ముఖచిత్రంగా మారాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో గోల్స్ సంఖ్యలో స్టార్ ఆటగాళ్లు మెస్సీ, రొనాల్డోతో పోటీ పడుతున్నారు. నిన్న హ్యాట్రిక్ గోల్స్‌తో కలిపి మొత్తం 90 గోల్స్ చేసి, ఎక్కువ గోల్స్ చేసిన ఆటగాళ్లలో ఆసియాలోనే రెండవ స్థానానికి చేరుకున్నాడు. ప్రపంచంలోనే అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ తర్వాత 4వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో 123 గోల్స్ చేసిన పోర్చుగల్ ఆటగాటు క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.