Womens Cricket : మైదానం నుంచి మార్కెట్ దాకా.. బ్రాండ్ వాల్యూలో కోహ్లీకి పోటీ ఇస్తున్న మహిళా క్రికెటర్లు.
Womens Cricket : భారత మహిళా క్రికెటర్లు కేవలం మైదానంలోనే అద్భుతాలు సృష్టించడమే కాక ఇప్పుడు బ్రాండ్ వ్యాల్యూ విషయంలో కూడా పురుషుల క్రికెట్ జట్టులోని దిగ్గజ ఆటగాళ్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇటీవల ప్రపంచకప్‌ను గెలుచుకున్న తర్వాత, హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ వంటి క్రీడాకారిణుల పాపులారిటీ అమాంతం పెరిగింది. ప్రముఖ క్రీడా నిర్వహణ సంస్థల నివేదికల ప్రకారం.. ఈ మహిళా క్రికెటర్ల బ్రాండ్ విలువ 100% కంటే ఎక్కువ పెరిగిందని తెలుస్తోంది. వీరు ఇప్పుడు దేశానికి కొత్త బ్రాండ్ ఐకాన్‌లుగా ఎలా మారారో, వారి ఆదాయ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
భారత మహిళా క్రికెటర్లు సాధించిన ప్రపంచకప్ విజయం, వారి క్రీడా జీవితంతో పాటు ఆర్థికంగానూ గొప్ప మలుపుగా మారింది. JSW స్పోర్ట్స్ బేస్‌లైన్ వెంచర్స్ వంటి క్రీడా నిర్వహణ సంస్థల ప్రకారం.. మహిళా క్రికెటర్ల బ్రాండ్ వ్యాల్యూ ఏకంగా 100% కంటే ఎక్కువ పెరిగింది. హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన వంటి స్టార్ ప్లేయర్లు సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది. దీంతో వీరిని తమ బ్రాండ్‌లకు ప్రచారం కోసం తీసుకోవడానికి ప్రముఖ కంపెనీలు పోటీ పడుతున్నాయి.
హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ ఇప్పుడు భారతదేశానికి కొత్త బ్రాండ్ ఐకాన్‌లుగా ఎదుగుతున్నారు. మహిళా క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ ఎంత పెరిగిందనే విషయాన్ని ఒక నివేదిక వివరించింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్రాండ్ వ్యాల్యూ సుమారు రూ.4.5 కోట్ల నుంచి రూ.8 కోట్ల మధ్య ఉండగా, ఇతర భారత పురుష క్రికెటర్ల బ్రాండ్ విలువ రూ.1.5 కోట్ల నుంచి రూ.4 కోట్ల మధ్య ఉంది.
ప్రపంచకప్ గెలవకముందు మహిళా క్రికెటర్ల బ్రాండ్ విలువ సగటున రూ.30 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ఉండేది. కానీ, ప్రపంచకప్ విజయం తర్వాత ఈ విలువ రూ.60 లక్షల నుంచి రూ.3 కోట్ల మధ్యకు పెరిగింది. స్మృతి మంధాన ప్రస్తుతం అత్యధికంగా బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఫీజు తీసుకుంటున్న మహిళా క్రికెటర్‌గా నిలిచారు. స్మృతి మంధాన ప్రస్తుతం 16 బ్రాండ్లను ఎండార్స్ చేస్తున్నారు. ఆమె ఒక్కో బ్రాండ్‌కి సుమారు రూ.1.2 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారు. యంగ్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ కూడా రెడ్‌బుల్, బోట్, నైకీ, సర్ఫ్ ఎక్సెల్ వంటి ప్రముఖ కంపెనీల ముఖంగా ఉన్నారు. ఆమె సైనింగ్ ఫీజు రూ.75 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు పెరిగింది.
మహిళా క్రికెటర్ల పెరుగుతున్న ప్రజాదరణను గుర్తించిన పెద్ద కంపెనీలు వారితో డీల్స్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఫిట్‌నెస్, హెల్త్ సప్లిమెంట్స్, పర్సనల్ కేర్ రంగాల్లోని హెర్బాలైఫ్, నైకీ వంటి బ్రాండ్లు వీరికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. బోట్, ప్యూమా, అడిడాస్, సర్ఫ్ ఎక్సెల్, కోకా-కోలా వంటి దిగ్గజ కంపెనీలు ఇప్పటికే మహిళా క్రీడాకారులను తమ బ్రాండ్ ఫేస్‌లుగా ఎంచుకున్నాయి. అంతేకాక, రెక్సోనా, రెడ్‌బుల్ వంటి కంపెనీలు కూడా తమ ప్రకటనల్లో వీరిని భాగం చేస్తున్నాయి.
గూగుల్ జెమిని, బోట్ వంటి టెక్ బ్రాండ్లు తమ డిజిటల్ క్యాంపెయిన్‌లలో మహిళా క్రీడాకారులను ఉపయోగిస్తున్నాయి. ఎస్‌బీఐ, పీఎన్‌బీ మెట్‌లైఫ్ ఇన్సూరెన్స్, హ్యుందాయ్, మహీంద్రా గ్రూప్ వంటి ఫినాన్షియల్, ఆటోమొబైల్ బ్రాండ్లు కూడా వీరితో తమ భాగస్వామ్యాన్ని పెంచుకుంటున్నాయి.