IPL: ముంబై ఇండియన్స్ బోణీ
కోల్‌కత్తాపై ఏకపక్ష విజయం... 116 పరుగులకే కుప్పకూలిన కోల్‌కత్తా;
ఐపీఎల్ లో మాజీ ఛాంపియన్ ముంబై ఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుసగా రెండు మ్యాచుల్లో పరాజయం పాలై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ముంబై.. కోల్ కత్తాపై సాధికార విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన మ్యాచులో ముంబై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచులో బంతితోనూ.. బ్యాటుతోనూ ముంబై సత్తా చాటింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కత్తా కేవలం 116 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 12.5 ఓవర్లలోనే ముంబై లక్ష్యాన్ని ఛేదించింది. రికెల్టెన్ 62 పరుగులతో సత్తా చాటడంతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.
సత్తా చాటిన బౌలర్లు
ఈ మ్యాచులో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ తీసుకుంది. ఈ నిర్ణయం సరైందేనని కాసేపటికే తెలిపోయింది. ముంబై బౌలర్ల ధాటికి కోల్ కత్తా పూర్తి ఓవర్లు కూడా ఆడలేక చతికిలపడింది. 16.2 ఓవర్లలో కేవలం 116 పరుగులకే కోల్ కత్తా కుప్పకూలింది. స్కోరు బోర్డుపై ఒక్క పరుగు చేరిందో లేదే తొలి వికెట్ పడిపోయింది. రెండు పరుగు వచ్చిందో లేదో రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత స్కోరు 25 పరుగులకు చేరే వరకూ మరో వికెట్ పడలేదు. కానీ 25 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోవడంతో కోల్ కత్తా వికెట్ల పతనం మళ్లీ ఆరంభమైంది. అశ్వనీ కుమార్ నాలుగు వికెట్లతో కోల్ కత్తా పతనాన్ని శాసించాడు. కోల్ కత్తా బ్యాటర్లలో టాప్ స్కోరు కేవలం 26 పరుగులే కావడం విశేషం. అయిదుగురు బ్యాటర్లు కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు.
రికెల్టెన్ దూకుడు
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకు పర్వాలేదనిపించే ఆరంభం దక్కింది. తొలి వికెట్ కు రోహిత్-రికెల్టెన్ 46 పరుగులు జోడించారు. అనంతరం రోహిత్ 13 పరుగులు చేసి అవుటైనా రికెల్టెన్ మాత్రం తగ్గలేదు. 41 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 62 పరుగులు చేసిన రికెల్టెన్.. చివరి వరకు అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. విల్ జాక్స్ 16 పరుగులు చేసి అవుటవ్వగా... సూర్యకుమార్ యాదవ్ చివర్లో మెరుపులు మెరిపించాడు. కేవలం 9 బంతులే ఎదుర్కొన్న సూర్య భాయ్.. 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 పరుగులు చేసి అజేయంగా నిలిచి తొలి విజయాన్ని అందించాడు.