IPL: విదేశీ ఆటగాళ్లకు ఎన్ఓసీ కష్టమేనా?
ఐపీఎల్ తేదీల ప్రకారమే ఎన్‌ఓసీలు జారీ;
మే 25న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ముగియాల్సి ఉంది. ఇప్పుడు కొత్త షెడ్యూల్ ప్రకారం జూన్ 3 వరకు టోర్నీ పొడిగించాల్సి వచ్చింది. విదేశీ ఆటగాళ్లందరూ మే 25 ప్రకారమే సిద్ధమై లీగ్ కోసం తమ ప్రణాళికలకు రూపొందించుకున్నారు. ఆ తేదీ తర్వాత ఆయా జాతీయ జట్ల సిరీస్‌లు, ఇతర ఒప్పందాల ప్రకారం వారు ఐపీఎల్‌లో కొనసాగే అవకాశం లేదు. ఐపీఎల్ తేదీల ప్రకారమే తాము ఎన్‌ఓసీలు జారీ చేశామని, దీనిపై మళ్లీ చర్చించిన తర్వాత తమ నిర్ణయం ప్రకటిస్తామని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. న్యూజిలాండ్ బోర్డు కూడా దాదాపు ఇదే తరహాలో స్పందించింది. మరో వైపు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆటగాళ్ల ఇష్టానికి వదిలేసింది. వారి వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకునేందుకు అవకాశం కల్పించింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ ఆటగాళ్లలో చాలా మంది ఐపీఎల్‌కు తిరిగి రావడంపై అనాసక్తిగానే ఉన్నారని తెలుస్తోంది. ఒకవేళ వచ్చినా గ్రూప్ స్టేజ్ ముగియకముందే టోర్నీకి గుడ్‌బై చెప్పనున్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో ప్లేఆఫ్స్ రేసులో ఉన్న టాప్-5 జట్ల గుజరాత్, బెంగళూరు, పంజాబ్, ముంబై, ఢిల్లీకు నష్టం తప్పకపోవచ్చు.
స్థానాల భర్తీకి యత్నాలు
కొంతమంది విదేశీ ఆటగాళ్లు తమ జట్లకు అందుబాటులో ఉండకపోవడంతో ఫ్రాంచైజీలకు వారి స్థానాలను భర్తీ చేయడం కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో తాత్కాలిక భర్తీలకు అవకాశం కల్పించే దిశగా ఐపీఎల్ నిర్వాహకులు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ తాత్కాలిక ప్లేయర్లకు 2026 రిటెన్షన్‌లో చోటు ఉండదని సమాచారం.