Jasprit Bumrah: ఇంగ్లాండ్ సిరీస్ కు బుమ్రా దూరం
ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా డౌట్.. ఆందోళన రేపుతున్న బుమ్రా గాయం;
ఆస్ట్రేలియా పర్యటనలో కంగారూలను ముప్పుతిప్పలు పెట్టిన టీమ్‌ఇండియా పేసు గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా గాయం.. అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. సిరీస్ ఓటమి కంటే అతడు పూర్తి స్థాయిలో ఎప్పటి వరకు కోలుకుని తిరిగి జట్టుతో కలుస్తాడనే దానిపైనే చర్చ జరుగుతోంది. వచ్చే నెలలో కీలకమైన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఉన్న నేపథ్యంలో బుమ్రా ఫిట్‌నెస్‌పై ఆందోళన నెలకొంది. ఈనెల 22 నుంచి ఇంగ్లండ్‌తో మొదలయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కూ బుమ్రా అందుబాటులో ఉండటం అనుమానమే. వెన్నునొప్పి తిరగబెట్టడంతో సిడ్నీ టెస్టు నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న బుమ్రా గాయం తీవ్రతపై పూర్తిస్థాయి స్పష్టత లేదు. ఒకవేళ అతడి గాయం గ్రేడ్- 1 లెవల్‌లో ఉంటే బుమ్రా పూర్తిస్థాయిలో కోలుకోవడానికి రెండు నుంచి మూడు వారాల సమయం పట్టొచ్చు.
ఇంగ్లండ్ తో సిరీస్ కు విశ్రాంతి
భారత్ ఇంగ్లాండ్ పై ఆడబోయే వైట్ బాల్ సిరీస్ కు బుమ్రా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయం తగ్గినా బుమ్రాపై పని భారం తగ్గించాలనే ఉద్దేశ్యంలో బీసీసీఐ అతనికి రెస్ట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి.ఈ సిరీస్ జనవరి 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కు బుమ్రా దూరమవ్వడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది. ఫిబ్రవరిలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది. బుమ్రా గాయం తీవ్రత ఎక్కవైతే మాత్రం ఈ ఫాస్ట్ బౌలర్ ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మెగా టోర్నీ నుంచి దూరమైనా ఆశ్చర్యం లేదు.
అతను ఉన్నప్పుడు అంతా బాగుంది: హర్భజన్
బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా విఫలం కావడంపై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఘాటుగా స్పందించారు. రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉన్న సమయంలో భారత జట్టు ప్రదర్శన బాగుందని.. గత ఆరు నెలలుగా జట్టు పర్మామెన్స్ ఆందోళనకరంగా ఉందని చెప్పారు. ఇంగ్లండ్‌తో జరగబోయే మ్యాచ్‌ల్లో భారత జట్టు సత్తా చాటాల్సిన అవసరం ఉందని తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నారు. టీ20 WC తర్వాత ద్రావిడ్ పదవీకాలం ముగియగా.. ప్రస్తుతం గంభీర్ హెడ్ కోచ్‌గా ఉన్నారు.