JUREL: సెలెక్టర్లకు తలనొప్పిగా మారిన ధ్రువ్ జురెల్
పరుగుల వరద పారిస్తున్న జురెల్... అనధికార టెస్టులో రెండు శతకాలు.... జురెల్‌కు జట్టులో స్థానంపై ఉత్కంఠ... నితీశ్‌ను తప్పిస్తారన్న ఊహాగానాలు
దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియా యంగ్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ సత్తాచాటుతున్నాడు. రెండో అనధికారిక టెస్ట్‌లో ఏకంగా రెండు శతకాలు సాధించాడు. నవంబర్ 14 నుంచి స్వదేశంలో సఫారీలతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి ని తుది జట్టు నుంచి తప్పించి ధ్రువ్ జురెల్‌ను స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రెండో అనధికారిక టెస్ట్‌లో మిగతా బ్యాటర్లు విఫలమైన చోట ధ్రువ్ జురెల్ సత్తాచాటాడు. 175 బంతుల్లో 132 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ అతడు సత్తాచాటాడు. 170 బంతుల్లో 127 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. గత కొన్ని రోజులుగా ధ్రువ్ జురెల్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ముఖ్యంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్నాడు. గత 8 ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్‌లలో అతడు.. 140, 1, 56, 125, 44, 6*, 132* & 127* పరుగులు చేశాడు. చివరి 14 ఇన్నింగ్స్‌లలో 90కి పైగా సగటుతో 911 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు.. నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 140. ప్రస్తుతం ధ్రువ్ జురెల్ తన ఫామ్‌తో కెప్టెన్, కోచ్‌కు సవాల్ విసురుతున్నాడు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో కచ్చితంగా చోటు ఇవ్వాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడు. దీనిపై స్పందించిన మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్.. జురెల్ తన ఫామ్‌తో రాబోయే టెస్ట్ మ్యాచ్ తుది జట్టు నుంచి తనను తప్పించలేని పరిస్థితి తీసుకొచ్చాడని ట్వీట్ చేశాడు. దక్షిణాఫ్రికాతో నవంబర్ 14 నుంచి జరిగే తొలి టెస్టులో జురెల్‌కు చోటు దక్కుతుందా? లేదా అన్నది తేలాల్సి ఉంది. దీంతో ఇప్పుడు తుది జట్టు ఎంపిక టీమ్ మేనేజ్మెంట్కు సవాలుగా మారింది. ఫామ్‌లో ఉన్న జురెల్‌ను ఆడించకపోతే విమర్శలు ఎదుర్కొక తప్పదు.
నితీశ్‌పై వేటు తప్పదా..?
‘జురెల్ స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడే అవకాశం ఉంది. అతడు టాప్, లోయర్ ఆర్డర్లలో ఆడటానికి సరిపోతాడు. కానీ, ప్రస్తుతం ఆ స్థానంలో ఆడుతున్న సాయి సుదర్శన్ గత టెస్టులో అర్ధ శతకం చేశాడు. అంతేకాకుండా మూడో స్థానం కోసం ప్రయోగాలు చేయొద్దని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. మరొక స్థానం నితీశ్ రెడ్డిది. భారత గడ్డపై జరిగే మ్యాచ్‌ల్లో అతని బౌలింగ్ పెద్దగా అవసరం ఉండదు. కాబట్టి జురెల్‌ని కాదని నితీశ్‌ని ఆడించలేము’ అని బీసీసీఐ వర్గాలు పీటీఐకి తెలిపాయి. భారత్, దక్షిణాఫ్రికా మధ్య నవంబర్ 14న ఈడెన్ గార్డెన్స్‌లో తొలి టెస్టు జరగనుంది. ఈ నెల 22 నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్టుకు గువాహటి ఆతిథ్యం ఇవ్వనుంది. ఫామ్‌లో ఉన్న జురెల్‌ను ఆడించకపోతే విమర్శలు ఎదుర్కొక తప్పదు. ఈ నేపథ్యంలో టీమ్ మేనేజ్మెంట్ కీలక నిర్ణయ తీసుకున్నట్లు సమాచారం. ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డిని తుది జట్టు నుంచి తప్పించి ధ్రువ్ జురెల్‌ను స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ టెస్టులో జురెల్‌ను ఎంపిక చేయకపోతే గంభీర్, శుభ్‌మన్ గిల్‌పై తీవ్ర విమర్శలు వచ్చే అవకాశం ఉంది. దీంతో టీమ్ మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందా అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.