క్రికెట్ ప్రేమికులకు శుభవార్త. ఓ రసపట్టు సమరానికి కౌంట్ డౌన్ మొదలైంది. దక్షిణాఫ్రికాతో భారత్ టీ-20 సిరీస్ ఇవాళ ప్రారంభం కానుంది. ఈ టూర్‌లో భాగంగా 4 మ్యాచ్‌లు ఆడనుంది. దర్బన్ వేదికగా రాత్రి 8.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. కాగా డర్బన్‌లో పిచ్ పేసర్లకు బాగా సహకరిస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో బాల్ బాగా బౌన్స్ అవుతుంది. సఫారీ పేసర్లను ఎదుర్కొని షాట్లు ఆడడం, పరుగులు సాధించడం తేలిక కాదని క్రికెట్ పండితులు చెబుతున్నారు. నవంబర్ 10, 13, 15 తేదీల్లో మిగతా మ్యాచ్‌లు జరగనున్నాయి.
మరోవైపు టీ20 జట్టులో కుదురుకునే ప్రయత్నం చేస్తున్న యువ ఆటగాళ్లకు ఈ సిరీస్ మంచి అవకాశం కానుంది. ఇక్కడ రాణిస్తే జట్టులో స్థానం సుస్థిరం అవుతుందడంతో ఆ దిశగా కృషి చేస్తున్నారు యువ ఆటగాళ్లు. జింబాబ్వేపై సత్తా చాటిన అభిషేక్ శర్మ తర్వాత ఫెయిల్ అయ్యాడు. ఈ సిరీస్‌లో ఎలా ఆడుతాడో చూడాలి. అతడితో కలిసి సంజు ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశముంది. సూర్య, తిలక్, హార్దిక్, రింకు వీరిని అనుసరిస్తారు. కుర్రాళ్లు తడబడ్డా ఇన్నింగ్స్‌ను నిలబెట్టాల్సిన, జట్టుకు భారీ స్కోర్లు సాధించి పెట్టాల్సిన బాధ్యత హార్దిక్, సూర్యల మీద ఉంది. హార్దిక్ నుంచి జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శన ఆశిస్తోంది. అర్ష్‌దీప్ సింగ్‌తో కలిసి అవేష్, యశ్ దయాళ్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. దేశవాళీల్లో రాణించి తొలిసారి భారత్‌కు ఆడబోతున్న లెఫ్టార్మ్ పేసర్ యశ్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. అక్షర్, వరుణ్ చక్రవర్తి స్పిన్ దాడి చూసుకుంటారు. దక్షిణాఫ్రికా టీ20 జట్టులోనూ ఎక్కువ మంది కుర్రాళ్లే కనిపిస్తున్నారు. కెప్టెన్ మార్‌క్రమ్, క్లాసెన్, మిల్లర్, కేశవ్ మహరాజ్ మాత్రమే సీనియర్లు. బౌలింగ్‌లో ఎక్కువగా యువ ఆటగాళ్లే ఉన్నారు. బార్ట్‌మన్, కొయెట్జీ, యాన్సెన్‌ల పేస్ దాడిని ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు సవాలుకానున్నారు. ఎంగబా పీటర్ స్పిన్నర్‌గా రాణిస్తున్నారు. మరో వైపు దక్షిణాఫ్రికా బ్యాటింగ్ బలంగానే కనిపిస్తోంది. భారత్ బ్యాటింగ్, బౌలింగ్‌లో ఉత్తమంగా ఆడితేనే విజయం సొంతమవుతుంది.