అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ హైదరాబాద్‌కు రానున్నాడు. మెస్సీ భారత్‌లో పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా 2025’ పేరుతో జరిగే ఆ పర్యటనలో ఓ మార్పు చోటు చేసుకుంది. మెస్సీ పర్యటించే నగరాల జాబితాలో హైదరాబాద్ కూడా చేరింది. ఈ విషయాన్ని టూర్ నిర్వాహకుడు సతద్రు దత్తా తెలిపారు. కేరళలో అర్జెంటీనా ఫ్రెండ్లీ మ్యాచ్ రద్దవడంతో హైదరాబాద్‌ను చేర్చినట్టు చెప్పారు. ‘నేను ఈ టూరును పాన్ ఇండియాకు మార్చాలనుకున్నా. కానీ, కేరళ ఈవెంట్ రద్దైంది. సౌత్ ఇండియా అభిమానులు కోసం హైదరాబాద్‌ను ఎంపిక చేశాం.’అని దత్తా తెలిపారు. హైదరాబాద్‌లో ఈవెంట్ గచ్చిబౌలి లేదా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుందని పేర్కొన్నారు. 14 ఏళ్ల తర్వాత మెస్సీ ఇండియాకు రానున్నాడు. డిసెంబర్లో అతని పర్యటన ఖరారైంది. కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో మెస్సీ సందడి చేయనున్నాడు. డిసెంబర్ 13న అతను హైదరాబాద్‌కు రానున్నాడు. మెస్సీ భారత పర్యటనకు రానుండడంతో భారత్‌లోని ఫుట్‌బాల్ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెస్సీ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.