ఇప్పుడు ఎక్కడ చూసినా సరే మెస్సీ.. మెస్సీ.. మెస్సీ అంటున్నాం. అతను మన దేశానికి చెందిన వ్యక్తి కాదు. మన దేశం తరఫున ఆడింది కూడా లేదు. కానీ ఆయన ఇండియాకు వస్తున్నాడంటే దేశమంతా ఉత్సాహంతో వెయిట్ చేసింది. కోట్లాది మంది ఆయన గురించే సోషల్ మీడియాలో చూశారు. ఒక్క సారి చూసినా చాలు అనుకున్నారు ఇండియన్ యువత. మరి అంతగా ప్రభావితం చేసిన మెస్సీ.. నిజంగా భారత యువతకు క్రీడా స్ఫూర్తిగా నిలుస్తాడనే చెప్పుకోవాలి. మిడిల్ క్లాస్ లో పుట్టి.. హార్మోన్ సమస్యలతో బాధపడ్డా సరే.. సవాళ్లను అధిగమించి ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ స్టార్ గా ఎదిగాడు. అది హార్డ్ వర్క్ తో మాత్రమే సాధ్యం అయింది. కానీ ఇండియాలో క్రికెట్ తప్ప ఫుట్ బాల్, ఇతర ఆటలను పెద్దగా పట్టించుకోవట్లేదు. మెస్సీ ఇండియాకు రావడం వల్ల ఫుట్ బాల్ మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ మొదలవుతోంది.
ఒక రకంగా మెస్సీ ఇండియన్ యువతకు ఫుట్ బాల్ తో పాటు క్రీడల మీద స్ఫూర్తిని నింపాడనే చెప్పుకోవాలి. భారత యువత మెస్సీని చూసి నేర్చుకోవాలి. మన ఇండియాలో తల్లిదండ్రులు ఆటలను పెద్దగా ఎంకరేజ్ చేయరు. ఎంతసేపు చదువుకో మంచి ఉద్యోగం చేసుకో అనే చెబుతారు గానీ.. ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే మన దేశంలో కూడా అద్భుతమైన ఫుట్ బాల్ స్టార్లు ఉండేవారేమో. ఇప్పుడు మెస్సీని చూసి అయినా ఇండియన్ పేరెంట్స్ లో కచ్చితంగా మార్పు రావాలి. పిల్లలను అన్నింట్లో ఎంకరేజ్ చేయాలనే ఆలోచన మొదలవ్వాలి. మెస్సీ లాగా తమ పిల్లలను కూడా స్టార్లుగా చూడాలనే కోరిక ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది.
మన దేశానికి చెందిన వ్యక్తి కాకపోయినా అతనికి ఇంతటి ఫ్యాన్ బేస్ ఇక్కడ ఉందంటే.. స్పోర్ట్స్ కు ఉన్న ఇంపార్టెన్స్ ను అందరూ గుర్తించాల్సిందే. మన ఇండియన్ క్రికెట్ సూపర్ స్టార్లు కూడా చదువు ఒక్కటే ఉంటే చాలు అనుకుంటే ఆ పొజీషన్ లో ఉండేవాళ్లు కాదు కదా. చదువుతో పాటు ఆటలను కూడా కచ్చితంగా ఎంకరేజ్ చేయాల్సిందే. అలాగే క్రికెట్ ఒక్కటే కాకుండా ఇండియాలో అన్ని రకాల ఆటలను ప్రోత్సహించాలి ప్రభుత్వాలు కూడా. మరి మన దగ్గర అలాంటి ప్రయత్నాలు మొదలవుతాయేమో చూద్దాం.