IPL: ముంబై ప్లే ఆఫ్స్ చేరడం ఖాయమేనా...?
సంక్లిష్టంగా ప్లే ఆఫ్స్ బెర్తులు;
గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమితో ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ప్రస్తుతం ఢిల్లీ 12 మ్యాచ్‌ల్లో 13 పాయింట్లతో ఉంది. చివరి రెండు మ్యాచుల్లోనూ గెలిస్తేనే ఆ జట్టు నాకౌట్‌కు చేరుకొనే ఛాన్స్ ఉంది. నాలుగో స్థానం కోసం ముంబై ఇండియన్స్ (12 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లు), లక్నో సూపర్ జెయింట్స్ (11 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లు) కూడా రేసులో ఉన్నాయి. నేడు హైదరాబాద్‌తో లక్నో తలపడనుంది. ఇందులో ఓడితే లక్నో ఇంటిముఖం పట్టినట్టే. ముంబై ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 21న జరగనున్న మ్యాచ్‌లో ఢిల్లీపై ముంబై గెలిస్తే ఇతర మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేకుండా నేరుగా నాకౌట్‌కు చేరుకుంటుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిచినా ముంబైకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అప్పటికి 13 మ్యాచ్‌లు ముగిసేసరికి ఢిల్లీ (15), ముంబయి (14) ఉంటాయి. అప్పుడు ముంబై, ఢిల్లీ ప్లే ఆఫ్స్ భవితవ్యం పంజాబ్ చేతిలో ఉంటుంది. ఈ రెండు తమ చివరి లీగ్ మ్యాచ్‌లను పంజాబ్‌తోనే ఆడాల్సి ఉంది. మే 24న ఢిల్లీ- పంజాబ్ మ్యాచ్, మే 26న పంజాబ్-ముంబయి మ్యాచ్‌లు జరగనున్నాయి. పంజాబ్ చేతిలో ఢిల్లీ ఓడిపోతే ముంబైకి మరో ఛాన్స్ వచ్చినట్టే. పంజాబ్‌ను ఓడిస్తే ముంబయి ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది.