MODI: పాఠశాలలకు వెళ్లి స్ఫూర్తి నింపండి
మహిళా క్రికెటర్లకు మోదీ సూచన... ప్రధాని మోదీతో విశ్వవిజేతల భేటీ... క్రికెటర్లతో ప్రధాని ఆసక్తికర చర్చలు.. ఫిట్ ఇండియా సందేశం వ్యాప్తి చేయండి
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో విజేతగా నిలిచిన భారత మహిళల జట్టులోని ఆటగాళ్లు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో ప్రధాని మోదీతో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా సమావేశమైంది. ఈ సందర్భంగా వరల్డ్ కప్ విశేషాలపై చర్చించారు. ప్రత్యేకమైన జెర్సీని భారత టీమ్.. మోదీకి గిఫ్ట్‌గా ఇచ్చింది. టోర్నీలో మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన తర్వాత భారత జట్టు పుంజుకున్న తీరును ఆయన మెచ్చుకున్నారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ఇతర ప్లేయర్లతో మోదీ మాట్లాడారు. ఫైనల్ బంతిని హర్మన్ జేబులో వేసుకోవడం గురించి ఆయన చర్చించారు. అదృష్టవశాత్తు బంతి తన దగ్గరకు వచ్చిందని, దాన్ని తన దగ్గరే పెట్టుకున్నానని హర్మన్ చెప్పింది. హర్లీన్ డియోల్ 2021లో ఇంగ్లాండ్‌పై అందుకున్న అద్భుత క్యాచ్‌ను కూడా ప్రధాని గుర్తు చేశారు. మోదీని కలవడం కోసం 2017 నుంచి తాను ఎదురుచూస్తున్నానని ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ దీప్తి శర్మ ఆయనతో చెప్పింది.
హర్మన్ ప్రీత్ కౌర్... వన్డే వరల్డ్ కప్‌ను ప్రధాని మోదీ చేతికి అందించారు. అలాగే ‘‘నమో.. 1’’ అని రాసి ఉన్న జెర్సీని కూడా అందజేశారు. ఇక, భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యులతో ప్రధాని మోదీ కాసేపు ముచ్చటించారు. టోర్నమెంట్‌కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్... 2017లో ప్రధాని మోదీ కలిసిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. అప్పుడు ట్రోఫీ లేకుండానే ప్రధానిని కలిశారని... ఇప్పుడు ట్రోఫీతో ఆయనను కలిశామని తెలిపారు. ఆయనను తరచుగా కలవాలని అనుకుంటున్నామని చెప్పారు. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మాట్లాడుతూ... ప్రధాని తమను మోటివేట్ చేశారని, స్ఫూర్తిదాయకంగా నిలిచారని అన్నారు. నేటి రోజుల్లో అమ్మాయిలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారని, దానికి ప్రధాన మంత్రి ఇచ్చిన ప్రోత్సాహమే కారణమని తెలిపారు. ప్రధాని మోదీ... దీప్తి శర్మ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 'జై శ్రీరామ్' అని రాసుకున్న విషయం, ఆమె చేతిపై ఉన్న భగవాన్ హనుమాన్ టాటూ గురించి ప్రస్తావించారు. అయితే అది తనకు బలాన్ని ఇస్తుందని దీప్తి శర్మ అన్నారు.