అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ ( Nita Ambani ) మరోసారి ఎన్నికయ్యారు. ఈ వారాంతంలో పారిస్ వేదికగా ఒలింపిక్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన 142వ IOC సమావేశంలో భారత్ నుంచి ఏకగ్రీవంగా ఆమె ఎన్నికయ్యారు. తనను ఎన్నుకున్నందుకు, ఇలా గౌరవించిన సభ్యులకు నీతా ధన్యవాదాలు తెలిపారు. ఐఓసీ సభ్యురాలిగా ఎన్నికైన నీతా అంబానీ మాట్లాడుతూ… ‘ఐఓసీ సభ్యురాలిగా తిరిగి ఎన్నిక కావడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నా. నాపై నమ్మకముంచిన అధ్యక్షుడు థామస్ బాక్, ఐఓసీలో నా సహచరులందరికీ ధన్యవాదాలు. ఇది కేవలం నా వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాదు.. ప్రపంచ క్రీడా రంగంలో భారతదేశం ప్రభావం పెరుగుందని గుర్తించడం కూడా. ఈ సంతోషం, గర్వాన్ని నేను ప్రతి భారతీయుడితో పంచుకుంటున్నాను. భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి’ అని అన్నారు.