OLYMPICS: భారత అభిమానుల హృదయాలు ముక్కలు

ఒలింపిక్స్‌ నుంచి సింధు అవుట్‌.. అదే బాటలో సాత్విక్‌-చిరాగ్‌శెట్టి జోడీ;

Update: 2024-08-02 03:30 GMT

భారత అభిమానుల గుండె పగిలింది. కోట్లాది మంది అభిమానులకు నిర్వేదాన్ని మిగులుస్తూ బ్యాడ్మింటన్‌ స్టార్‌ ఒలింపిక్స్‌ నుంచి వెనుదిరిగింది. రియో ఒలింపిక్స్‌లో రజతం.. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సింధు ఈసారి రిక్త హస్తాలతో వెనుదిరిగింది. పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ పతకంతో హ్యాట్రిక్‌ కొడుతుందని ఆశల్ని కూల్చేస్తూ సింధు.. క్వార్టర్స్‌ కూడా చేరకుండానే ఇంటిముఖం పట్టింది. బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో సింధు 19-21, 14-21తో చైనా అమ్మాయి హే బిన్‌జియావో చేతిలో పరాజయం పాలైంది. తొలి గేమ్‌ను గెలిచే మంచి అవకాశాన్ని చేజార్చుకున్న సింధు.. ఆ తర్వాత పుంజుకోలేకపోయింది. మ్యాచ్‌ ఆరంభంలో 1-5తో వెనుకబడ్డ సింధు.. తర్వాత పుంజుకుని విరామ సమయానికి అంతరాన్ని 10-11కు తగ్గించింది. ఆ తర్వాత సింధు ఎంత ప్రయత్నించినా.. ప్రత్యర్థి ఆమెకు ఆధిక్యం సాధించే అవకాశమివ్వలేదు. అయితే 19-19తో స్కోరు సమం కావడంతో సింధుకు మంచి అవకాశం లభించింది. కానీ ప్రత్యర్థికి రెండు పాయింట్లు ఇచ్చుకుని గేమ్‌ను కోల్పోయింది. ఆధిక్యంలోకి వెళ్లిన ఉత్సాహంలో బిన్‌జియావో రెండో గేమ్‌లో విజృంభించి ఆడింది. 13-5తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇద్దరి ఆటతీరు చూస్తే.. ఇక సింధు పుంజుకోవడం కష్టమే అని అప్పటికే అర్థమైపోయింది. ప్రత్యర్థి అదే ఊపులో 19-11కు చేరుకుంది. ఈ దశలో సింధు మూడు పాయింట్లు సాధించినా.. వెంటనే ప్రత్యర్థి కూడా రెండు పాయింట్లు గెలుచుకుని మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. టోక్యోలో బిన్‌జియావోను ఓడించే సింధు కాంస్యం గెలిచింది. కొన్ని స్మాష్‌లు కోర్టు బయట పడ్డాయని.. కొన్ని తప్పులు చేశానని అవే తన ఓటమికి కారణమని సింధు మ్యాచ్‌ అనంతరం వ్యాఖ్యానించింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించనందుకు బాధగా ఉందని సింధు తెలిపింది.


ప్రపంచ బ్యాడ్మింటన్‌లో వేగంగా అత్యున్నత స్థాయిని అందుకుని ఒలింపిక్స్‌లోనూ కచ్చితంగా పతకం గెలిచేలా కనిపించిన ఆంధ్ర కుర్రాడు సాత్విక్‌ సాయిరాజ్‌కు పారిస్‌లో చుక్కెదురైంది. చిరాగ్‌ శెట్టితో కలిసి అతను పురుషుల డబుల్స్‌ క్వార్టర్స్‌ దశలోనే ఒలింపిక్స్‌ నుంచి నిష్క్రమించాడు. గురువారం హోరాహోరీగా సాగిన పోరులో సాత్విక్‌-చిరాగ్‌ జంట 21-13, 14-21, 16-21తో మలేసియా ద్వయం ఆరోన్‌ చియా- వూయ్‌ యిక్‌ చేతిలో పరాజయం పాలయ్యారు. తమదైన శైలిలో దూకుడుగా ఆడుతూ మ్యాచ్‌ను ఘనంగానే ఆరంభించిన భారత జోడీ.. రెండో గేమ్‌ నుంచి కాస్త గాడి తప్పింది. ప్రతి పాయింట్‌ కోసం ఇరు జోడీలు ఎంతో శ్రమించినా.. ఒత్తిడిలో నిబ్బరంతో ఆడిన మలేసియా జంటనే విజయం వరించింది. ఇప్పటికే వరుసగా ఎనిమిదిసార్లు సాత్విక్, చిరాగ్‌లను ఓడించిన రికార్డున్న చియా-వూయ్‌ జంట.. తొలి గేమ్‌ ఓడిన తర్వాత అద్భుత ఆటతీరుతో భారత జోడీకి షాకిచ్చింది.

ఆరంభ గేమ్‌ 5-5, 10-10తో ఒక దశ వరకు హోరాహోరీగానే సాగింది. కానీ విరామం తర్వాత భారత జోడీ దూకుడుగా ఆడి గేమ్‌ను చేజిక్కించుకుంది. రెండో గేమ్‌ను 4-0 ఆధిక్యంతో ఆరంభించడంతో సాత్విక్‌-చిరాగ్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లబోతున్నట్లే అనిపించింది. కానీ ఇక్కడ్నుంచే చియా-వూయ్‌ గొప్పగా పుంజుకుని 10-10తో స్కోరు సమం చేసింది. విరామం తర్వాత ఇంకా దూకుడు పెంచి గేమ్‌ను సొంతం చేసుకుంది. నిర్ణయాత్మక మూడో గేమ్‌ ఎంతో హోరాహోరీగా సాగింది. అయితే ఒక దశలో 14-11తో సాత్విక్‌ జోడీ ఆధిక్యం సాధించడంతో ఆ ఊపులో మ్యాచ్‌ గెలిచేస్తారనిపించింది. కానీ మళ్లీ పుంజుకుని స్కోరు సమం చేసింది మలేసియా జోడీ. 14-14, 16-16తో స్కోరు సమమవడంతో మ్యాచ్‌ ఎటైనా మొగ్గేలా కనిపించింది. అయితే తీవ్ర ఒత్తిడిలో ప్రత్యర్థి ద్వయం నిబ్బరాన్ని ప్రదర్శించగా.. భారత ద్వయం తప్పులు చేసి మూల్యం చెల్లించుకుంది. సాత్విక్, చిరాగ్‌లను 16 మీదే ఉంచి 20కి చేరుకున్న మలేసియా ద్వయం.. సాత్విక్‌ కొట్టిన చివరి షాట్‌ నెట్‌కు తాకడంతో సంబరాల్లో మునిగిపోయింది.

Tags:    

Similar News