OLYMPICS: కల నెరవేర్చుకున్న స్వప్నిల్‌

షూటింగ్‌లో గురి తప్పలేదు... భారత్‌కు మరో కాంస్యం... సత్తా చాటిన స్వప్నిల్ కుసాలే;

Update: 2024-08-02 00:30 GMT

పారిస్ ఒలింపిక్స్‌ 2024లో భారత యువ షూటర్‌ స్వప్నిల్ కుసాలే సత్తా చాటాడు. ఛటౌరోక్స్‌లోని నేషనల్ షూటింగ్ సెంటర్‌లో జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఫైనల్‌లో మూడో స్థానంలో నిలిచి.. కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. దాంతో భారత్‌ ఖాతాలో మూడో పతకం చేరింది. ఇప్పటికే షూటింగ్ విభాగంలో భారత్‌కు రెండు 2 పతకాలు వచ్చిన విషయం తెలిసిందే.


తీవ్రమైన పోటీ మధ్య స్వప్నిల్ కుసాలే అసాధారణ ప్రదర్శనచేశాడు. ఫైనల్‌లో 451.4 పాయింట్లతో మూడో స్థానాన్ని సంపాదించాడు. కాస్త నెమ్మదిగా ప్రారంభించిన స్వప్నిల్.. కీలక సమయంలో మాత్రం పుంజుకొన్నాడు. ఓ దశలో 4, 5 స్థానాల్లో కొనసాగిన అతడు టాప్‌-3లోకి వచ్చాక వెనక్కి తిరిగిచూడలేదు. మూడు పొజిషన్లలో జరిగిన ఈ పోటీల్లో ప్రోన్‌ (బోర్లా పడుకొని), నీలింగ్‌ (మోకాళ్ల మీద), స్టాండింగ్‌ (నిల్చొని) షూటింగ్‌ చేయాలి. మోకాళ్లపై 153.5 పాయింట్లు, ప్రోన్‌లో 156.8 పాయింట్లు, స్టాండింగ్‌లో 141.1 పాయింట్లను సాధించాడు. ఇక చైనాకు చెందిన లి యుకున్ (463.6) స్వర్ణ పతకం, ఉక్రెయిన్‌ షూటర్ కులిష్‌ సెర్హియ్‌ (461.3) రజత పతకం కైవసం చేసుకున్నారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారతీయ షూటర్‌గా స్వప్నిల్ నిలిచాడు. ఒకే ఎడిషన్‌లో భారత షూటింగ్‌ బృందం మూడు పతకాలు సాధించడం ఇదే తొలిసారి. ఏ ఒలింపిక్స్‌లోనూ షూటింగ్‌ బృందం ఇంతలా చెలరేగలేదు.

నిరాశపర్చిన నిఖత్‌

పారిస్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణంపై గురిపెట్టిన తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ నిరాశపరిచింది. మహిళల 50 కేజీల విభాగంలో ప్రీక్వార్టర్స్‌లో చైనా బాక్సర్‌ వు హు చేతిలో 0-5 తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఒలింపిక్స్‌లో నిఖత్ పతక ఆశలు ఆవిరయ్యాయి. ప్రపంచ ఛాంపియన్ అయిన నిఖత్‌పై ప్రత్యర్థి చైనా బాక్సర్ వుహు తొలి రౌండ్‌లో పదునైన పంచ్‌లతో విరుచుకుపడింది. మొదటి రౌండ్‌ను నిఖత్ 49-46తో చేజార్చుకుంది. రెండో రౌండ్‌ను 48-47తో ముగించింది. చివరి రౌండ్‌లో 45-50 తేడాతో ఓటమిపాలైంది. తొలి బౌట్‌లో జర్మనీ బాక్సర్‌పై గెలిచి రౌండ్‌ ఆఫ్‌ 16లో అడుగు పెట్టిన నిఖత్‌.. చైనా బాక్సర్ జోరు ముందు నిలవలేకపోయింది. ఈసారి ఒలింపిక్స్ లో బాక్సింగ్ నుంచి కచ్చితంగా ఓ మెడల్ తెస్తుందనుకున్న నిఖత్ జరీన్ కనీసం క్వార్టర్ ఫైనల్ కూడా చేరకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. 50 కేజీల విభాగంలో రౌండ్ ఆఫ్ 16లోనే నిఖత్ పోరు ముగిసింది.

Tags:    

Similar News