పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్‌కు జట్టు యాజమాన్యం షాక్ ఇచ్చినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అతడిని ఇంగ్లాండ్‌తో జరగనున్న రెండో టెస్టు స్క్వాడ్ నుంచి తొలగించినట్లు ప్రచారం జరుగుతోంది. అతడు తొలి టెస్టులో కేవలం 30, 5 స్కోర్లు మాత్రమే చేశాడు. బ్యాటర్లకు స్వర్గధామం లాంటి పిచ్‌పై రాణించకపోవడంతో అతడిపై చాలా మంది అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. ఇటీవలే పాక్ క్రికెట్ బోర్డు సెలక్షన్ కమిటీలో కీలక మార్పులు చేసింది. సెలక్షన్ కమిటీలోకి పాకిస్థాన్ మాజీ అంపైర్ అలీం దార్‌ను తీసుకున్నారు. ఈ నిర్ణయం పలువురు విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. మాజీ ఆటగాళ్లు ఆఖిబ్ జావెద్, అజర్ అలీ, అనలిస్ట్ హసన్ చీమాకు కూడా దీనిలో స్థానం కల్పించారు. ఇప్పటికే కమిటీలో అసద్ షఫీక్ ఉండగా.. కొన్నాళ్ల క్రితమే దీని నుంచి మహమూద్ యూసఫ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ కొత్త కమిటీలో ప్రతి ఒక్క సభ్యుడికి ఓటింగ్ హక్కులు ఇచ్చారు. తాజాగా ఈ కొత్త కమిటీ బాబర్‌ను తప్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ ఆంగ్ల క్రీడా పత్రిక కథనంలో పేర్కొంది. ముఖ్యంగా అలీందార్, ఆఖిబ్ జావెద్, అజర్ అలీలు అతడికి తీవ్ర వ్యతిరేకంగా ఉన్నట్లు వెల్లడించింది. ఈ కమిటీ తమ నిర్ణయాన్ని పీసీబీ ఛైర్మన్ మోహసీన్ నక్వీకి రిపోర్టు చేసింది. బాబర్ తమ జట్టు బెస్ట్ బ్యాటర్ అంటూ కెప్టెన్ షాన్ మసూద్ కితాబ్ ఇచ్చినా.. సెలక్షన్ కమిటీ కఠిన నిర్ణయానికే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. సెలక్టర్లు శనివారం ముల్తాన్‌కు వెళ్లి కెప్టెన్, కోచ్‌లతో భేటీ అయ్యారు. అంతేకాదు.. ఇక్కడ పిచ్‌ను తయారు చేసిన టోనీ హెమ్మంగ్‌పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగుతున్నాయి.