టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను ( Rohit Sharma ) చూస్తోంటే పట్టరాని ఆనందంగా ఉందని BCCI మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. ఆయన జీవితం పరిపూర్ణమైందని చెప్పారు. ‘నేను BCCI అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే రోహిత్ కెప్టెన్సీ చేపట్టారు. అసలు రోహిత్‌కు కెప్టెన్సీ చేయడమే ఇష్టం లేదు. కానీ మేమే ఆయనను ఒప్పించేందుకు నానా తంటాలు పడి బలవంతంగా ఒప్పించాం. ఇప్పుడు అతడి సారథ్యంలో ప్రపంచకప్ సాధించబోతున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.
టీమ్ ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఇవాళ జరిగే టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చివరి మ్యాచ్ అని తెలుస్తోంది. గెలిచినా, ఓడినా వీరిద్దరికీ ఇదే ఆఖరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది. కుర్రాళ్లకు అవకాశం ఇచ్చేందుకు వీరిద్దరూ పొట్టి ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. వన్డే, టెస్టుల్లో ఇంకెన్నాళ్లు కొనసాగుతారో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
బాల్ టాంపరింగ్ ఆరోపణలు చేసేవారు కాస్త బ్రెయిన్ వాడాలంటూ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలపై ఇంజమామ్ తీవ్రంగా స్పందించారు. ‘రివర్స్ స్వింగ్ అంటే ఏంటో మాకు చెప్పొద్దు. అదెలా వేయాలో క్రికెట్ ప్రపంచానికి నేర్పిందే మేము. కండిషన్స్ గురించి మాకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. అంపైర్లు కళ్లు తెరవాలని మాత్రమే నేను చెబుతున్నాను. వారు బ్రెయిన్ వాడితే ఏ సమస్య ఉండదు’ అని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.