టీమ్ ఇండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాడు. కేవలం రెండు నెలల్లోనే సర్ఫరాజ్ ఖాన్ ఏకంగా 17 కిలోలు తగ్గాడు. బొద్దుగా ఉండే అతను చాలా స్లిమ్‌గా మారిపోయాడు. తాజాగా జిమ్‌లో దిగిన ఫొటోలను సర్ఫరాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఆ ఫొటోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ ఫొటోల్లో ఉంది సర్ఫరాజ్ ఖానే అనే అంతలా బరువు తగ్గాడు. 27 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్‌లో ప్రతిభకు కొదవలేదు. బ్యాటింగ్‌పై ఎవరికీ అనుమానాలు లేవు. ఇంగ్లాండ్‌తో అరంగేట్ర సిరీస్‌లోనే తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌పై రెండో టెస్టులో(150 రన్స్) భారీ శతకం బాదాడు. అయినప్పటికీ అధిక బరువు కారణంగా అతనిపై విమర్శలు వచ్చాయి. సర్ఫరాజ్‌ను ఎంపిక చేయకపోవడానికి కారణం చెప్పకపోయినా అధిక బరువు కూడా ఓ రీజనే అంటూ వార్తలు వచ్చాయి.