Kothagudem: కన్నతండ్రి మరణం.. అయినా వీడని లక్ష్యం: లాంగ్ జంప్‌లో కృతిక గోల్డ్ మెడల్

Kothagudem: కన్న తండ్రి చనిపోతే ఉండే బాధను మాటల్లో వర్ణించలేం. అలాంటిది నిన్నటివరకు తనతో ఆడి పాడిన ఆకస్మికంగా దూరమైతే ఆ బిడ్డల బాధను ఊహించలేం.

Update: 2022-12-07 07:14 GMT

Kothagudem: కన్న తండ్రి చనిపోతే ఉండే బాధను మాటల్లో వర్ణించలేం. అలాంటిది నిన్నటివరకు తనతో ఆడి పాడిన ఆకస్మికంగా దూరమైతే ఆ బిడ్డల బాధను ఊహించలేం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆమె లక్ష్యాన్ని విస్మరించలేదు. ఇటీవల గుత్తికోయల దాడిలో చనిపోయిన FRO శ్రీనివాసరావు కుమార్తె కృతిక తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. తండ్రి దూరమయ్యాడన్న బాధను భరిస్తూనే...రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఛాంపియన్‌గా నిలిచింది. లాంగ్‌ జంప్‌ విభాగంలో బంగారు పతకం సాధించింది.


తండ్రి శ్రీనివాసరావు సూచనలు పాటిస్తూ అథ్లెటిక్స్ సాధన చేస్తున్న కృతిక.. జిల్లా స్థాయి పోటీలకు సిద్ధమవుతుండగా శ్రీనివాస రావు హత్యకు గురయ్యారు. ఐనప్పటికీ బంధువుల ప్రోత్సహంతో ఘటన జరిగిన నాలుగో రోజునే కొత్తగూడెంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంది కృతిక.



ఆ పోటీల్లో లాంగ్‌ జంప్‌లో మొదటి స్థానం, వందమీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించింది. ఇక సోమవారం తండ్రి దశదిన కర్మ పూర్తి కాగానే.. హైదరాబాద్‌కు బయల్దేరిన కృతిక గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో మంగళవారం జరిగిన రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొని.. గోల్డ్ మెడల్ సాధించింది.


ఈ సందర్భంగా అసోసియేషన్‌ సభ్యులు కృతికను అభినందించారు. బాధను భరిస్తూ కృతిక కనబర్చిన పోరాట పటిమపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కృతిక ప్రస్తుతం కొత్తగూడెం విద్యానగర్‌ కాలనీలోని ప్రైవేట్‌ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది.

Tags:    

Similar News