Border Gavaskar Trophy: ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీకిదే చివరి సిరీస్‌.

గంగూలీ ఏం చెప్పాడంటే?;

Update: 2024-11-18 05:15 GMT

స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌ల్లో పేలవ ప్రదర్శనతో టీమ్ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ  పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో అతడికి మాజీ కెప్టెన్ సౌరబ్‌ గంగూలీ  మద్దతుగా నిలిచాడు. త్వరలో ప్రారంభం కానున్న ప్రతిష్ఠాత్మక బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ  అతడికి చక్కటి అవకాశమని.. అతడు తిరిగి ఫామ్‌లోకి వస్తాడని ఆశాభావం వ్యక్తంచేశాడు.

కోహ్లీ ఈ ఏడాదిలో ఆడిన 12 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 250 పరుగులు మాత్రమే చేశాడు. జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు ఔట్‌ అవుతూ.. నిరాశపరుస్తున్నాడు. అయితే.. ఆస్ట్రేలియాలో ఈ పరుగుల రారాజు రికార్డులు మాత్రం బాగానే ఉన్నాయి. 13 టెస్టుల్లో 54.08 సరాసరితో మొత్తం 1,352 పరుగులు చేశాడు. ఇందులో ఆరు శతకాలు ఉండటం విశేషం. ఈ గణాంకాలనే చూపుతూ కోహ్లీకి ఆస్ట్రేలియా గడ్డపై ఇది గొప్ప సిరీస్‌ అవుతుందని గంగూలీ పేర్కొన్నాడు. అతడి కెరీర్‌లో ఆసీస్‌ గడ్డపై ఆడే చివరి టెస్టు సిరీస్‌ కూడా ఇదే అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

‘‘కచ్చితంగా విరాట్‌ ఒక ఛాంపియన్ బ్యాటర్‌. గతంలో అతడు ఆస్ట్రేలియా గడ్డపై విజయాలు సాధించాడు. 2014లో నాలుగు సెంచరీలు నమోదు చేశాడు. 2018లో ఒక శతకం బాదాడు. ఈ సిరీస్‌ను అతడు తీవ్రంగా తీసుకుంటాడు. టెస్టు క్రికెట్‌ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించడం కెరీర్‌లో ఇదే చివరిసారని కూడా అతడికి తెలుసు. కాబట్టి.. ఏ కోణంలో చూసినా.. ఈ సిరీస్‌ అతడికి ఎంతో ప్రతిష్ఠాత్మకం అవుతుంది’’ అని దాదా ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ విశ్లేషించాడు.

ఇక ఇటీవల కోహ్లీ న్యూజిలాండ్‌ సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బందిపడుతున్నాడు. ఈ విషయంపైనా గంగూలీ స్పందిస్తూ.. అతడి ఫామ్‌పై ఎలాంటి ఆందోళన లేదన్నాడు. ఆ పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలించలేదని.. ఆస్ట్రేలియాలోని పరిస్థితులు వేరని వివరించాడు. ‘న్యూజిలాండ్‌తో సిరీస్‌లో కోహ్లీ ఫామ్‌ గురించి లోతుల్లోకి వెళ్లాల్సిన పని లేదు. బ్యాటింగ్‌కు ఆ పిచ్‌లు పెద్దగా సహకరించలేదు. అయితే ఆసీస్‌లోని పరిస్థితులను మాత్రం కోహ్లీ బాగా ఎంజాయ్‌ చేస్తాడు. అక్కడ మంచి పిచ్‌లు ఉంటాయి. అక్కడ అతడు గొప్ప ప్రదర్శన చేస్తాడని నేను నమ్ముతున్నాను’’ అని గంగూలీ తెలిపాడు.

సర్ఫరాజ్‌ ఖాన్‌ను కూడా గంగూలీని వెనకేసుకొచ్చాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో 150 పరుగులు చేసిన అతడు.. చివరి రెండు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. అయితే.. అతడికి బోర్డర్ గావస్కర్‌ ట్రోఫీలో అవకాశం ఇవ్వాలని కోరాడు.

Tags:    

Similar News