CT2025: సెమీ ఫైనల్‌కు సౌతాఫ్రికా
ఇంగ్లండపై ఘన విజయం... బ్రిటీష్ జట్టుపై విమర్శల జల్లు;
ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఇప్పటికే న్యూజిలాండ్, ఇండియా, ఆస్ట్రేలియా జట్లు సెమీఫైనల్‌కు చేరుకోగా.. తాజాగా సౌతాఫ్రికా జట్టు కూడా నాకౌట్ కు చేరుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 179 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ దిగిన సౌతాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 29.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్ విజయంతో సఫారీ జట్టు అధికారికంగా సెమీస్‌లోకి అడుగు పెట్టింది. ఈ మ్యాచులో యాన్సెన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా 5 పాయింట్లతో గ్రూపులో అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా (4 పాయింట్లు)కు రెండో స్థానం లభించింది.
కుప్పకూలిన ఇంగ్లాండ్
ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. ఇంగ్లాండ్ 38.2 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ ఇన్నింగ్‌లో రూట్(37), డకెట్(24), ఆర్చర్ (25) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో, ముల్డర్ చేరో మూడు, కేశవ్ మహారాజ్ రెండు వికెట్లు తీసుకున్నారు. లివింగ్‌స్టన్ (9), ఒవర్టన్ (11) ఎక్కువసేపు నిలువలేదు. బట్లర్ (21), ఆర్చర్ (25) ఎనిమిదో వికెట్‌కు 42 పరుగులు జోడించారు. ఇంగ్లాండ్ 8 పరుగులకే చివరి మూడు వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లాండ్ జట్టు రెండొందలు కూడా దాటలేకపోయింది. .
దంచేసిన దక్షిణాఫ్రికా
స్వల్ప లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. స్టబ్స్ (0)ను కోల్పోయింది. వేగంగా ఆడిన మరో ఓపెనర్ రికిల్టన్ (27; 25 బంతుల్లో 5×4) 9వ ఓవర్లో వెనుదిరిగడంతో 47 పరుగులకే దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయింది. అయితే వాండర్‌డసెన్‌తో కలిసిన క్లాసెన్ ధనాధన్ బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. క్లాసెన్ 41 బంతుల్లో, వాండర్‌డసెన్ 72 బంతుల్లో అర్ధశతకాలు పూర్తి చేశారు. 29వ ఓవర్లో క్లాసెన్ ఔట్ కావడంతో 127 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కానీ అప్పటికే దక్షిణాఫ్రికా విజయం ఖాయమైపోయింది. క్లాసెన్ వెనుదిరిగేటప్పటికి ఆ జట్టు స్కోరు 174. మిల్లర్ (7 నాటౌట్)తో కలిసి వాండర్‌డసెన్ లాంఛనాన్ని పూర్తి చేశాడు.