Suryakumar Yadav: చరిత్రలో నిలిచిపోయే క్యాచ్ తో టీమిండియాను గెలిపించిన సూర్య

సూర్య అందుకుంది క్యాచ్ కాదు, ఐసీసీ ట్రోఫీ;

Update: 2024-06-30 03:00 GMT

 టీమిండియా 17ఏళ్ల నిరీక్షణ ముగిసింది. ప్రపంచ కప్ టోర్నీలో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఎంఎస్ ధోని సారథ్యంలో చివరిసారిగా భారత్‌కు ఐసీసీ ట్రోఫీని అందించిన 17 ఏళ్ల తర్వాత రోహిత్ సేన రెండోసారి టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడింది. శనివారం రాత్రి టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో ఉత్కంఠభరింతగా జరిగిన మ్యాచ్ లో భారత్ జట్టు అద్భుతమైన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో సఫారీలు విఫలమయ్యారు. నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో టీమిండియా ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది.


టీమిండియా అద్భుత విజయం సాధించడానికి ప్రధాన కారణాల్లో ఒకటి సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్. చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా జట్టు 16పరుగులు చేయాల్సి ఉంది. హార్దిక్ బౌలింగ్ ప్రారంభించాడు. క్రీజులో మిల్లర్ ఉండటంతో సఫారీ జట్టు విజయం ఖాయమని అందరూ భావించారు. హార్దిక్ మొదటి బంతి వేయగానే.. మిల్లర్ భారీ సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించాడు.. బాల్ గాల్లోకి ఎగిరి బౌండరీ బయట పడబోయే సమయంలో రాకెట్ వేగంతో దూసుకొచ్చిన సూర్యకుమార్ యాదవ్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. క్యాచ్ అందుకొని బౌండరీ బయట అడుగు పెట్టే క్రమంలో చేతిలోని బాల్ ను సూర్య గాల్లోకి విసిరాడు.. తిరిగి బౌడరీ బయటకు వచ్చి క్యాచ్ అందుకున్నాడు. అద్భుత క్యాచ్ తో టీమిండియా ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్నంటాయి.

సూర్యకుమార్ యాదవ్ పట్టిన అద్భుత క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. సూర్య ఆ క్యాచ్ అందుకోకుంటే మిల్లర్ దక్షిణాఫ్రికాను విజయతీరాలకు చేర్చేవాడు అనడంలో ఎలాంటి సంకోచం లేదు. కానీ, సూర్య అద్భుత క్యాచ్ తో మిల్లర్ పెవిలియన్ బాట పట్టడంతో టీమిండియా విజయం ఖాయమైంది. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపకపోవటంతో టీమిండియా ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. సూర్య పట్టిన క్యాచ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సూర్యా భాయ్.. నువ్వు సూపర్ భాయ్ అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Tags:    

Similar News