Team India : రోహిత్ సేనకు సినీ ప్రముఖుల అభినందనలు
మైక్రోసాఫ్ట్ సీఈవో , గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో కూడా;
సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. కల నిజమైంది. భారత్ మళ్లీ విశ్వవిజేతగా నిలిచింది. ఎప్పుడో 2007లో టీ20 ప్రపంచకప్ మొదలైనపుడు ఆ టైటిల్‌ను సొంతం చేసుకున్న భారత్.. మధ్యలో ఏడు కప్పుల విరామం తర్వాత ఇన్నేళ్లకు మళ్లీ ఇప్పుడు ఆ టోర్నీలో విజేతగా నిలిచింది. శనివారం నాటకీయ మలుపులు తిరుగుతూ.. తీవ్ర ఉత్కంఠ రేపుతూ సాగిన 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో రోహిత్ సేన 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది.
ఈ అద్భుత విజయాన్ని యావత్ భారత దేశం సెలబ్రేట్ చేసుకుంది. సినీ నటులు అజయ్ దేవగన్, రవీనా టాండన్, అనిల్ కపూర్, అభిషేక్ బచ్చన్ సామాజిక మాధ్యమాల్లో టీమిండియాను ఆకాశానికి ఎత్తేశారు. ఈ సంతోషాన్ని పంచుకోవడానికి మాటలు చాలవని అజయ్ దేవగన్ పేర్కొన్నాడు. భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి కూడా భారత క్రికెట్ జట్టుకు అభినందనలు తెలిపారు. అద్బుతమైన ఫైనల్ అంటూ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఎక్స్‌లో పోస్ట్ చేశారు. భారత జట్టుకు అభినందనలు తెలిపిన సత్య నాదెళ్ల బాగా ఆడిందని దక్షిణాఫ్రికా జట్టును సైతం మెచ్చుకున్నారు. వెస్టిండీస్, అమెరికాలో మరింత క్రికెట్ ఆడాలని ఆయన అభిలాషించారు. గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ "ఏం ఆట" అని ప్రసంశలు కురిపించారు. విజయానికి భారత్ అర్హమైన జట్టని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా జట్టు ఆటతీరును కూడా కొనియాడారు.