CRICKET: టీమిండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం

భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికిన అభిమానులు... కిక్కిరిసిన ముంబై వీధులు;

Update: 2024-07-05 01:00 GMT

ముంబై జనసంద్రంలా మారింది. విజయోత్సవంతో తడిసి ముద్దయింది. లక్షలాది అభిమానుల కోలహలాల మధ్య... టీ 20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టును బీసీసీఐ ఘనంగా సన్మానించింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా విశ్వ విజేతలుగా నిలిచిన రోహిత్ సేనకు భారత అభిమానులు కనీవినీ ఎరుగని స్వాగతం పలికారు. ముంబై వీధులు కిక్కిరిసిన వేళ... భారీగా క్రికెట్‌ అభిమానులు తరలివచ్చిన వేళ భారత క్రికెట్‌ జట్టుకు ఘన స్వాగతం లభించింది. టీమిండియా స్టార్లు ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని విధంగా స్వాగతం అభిమానులు. తర్వాత వాంఖడే స్టేడియంలో క్రికెటర్లు, అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. మైదానం చుట్టూ తిరిగిన ఆటగాళ్లు డాన్సులు చేస్తూ సందడి చేశారు. రోహిత్‌ శర్మ, కోహ్లీ సహా ఆటగాళ్లు అందరూ డ్యాన్స్‌లతో అదరగొట్టారు.


టీ 20 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో భాగమైనందుకు క్రికెటర్లు కాస్త భావోద్వేగానికి కూడా గురయ్యారు. వాంఖడేలో జగజ్జేతలుగా నిలిచిన క్రికెటర్లను సన్మానించిన బీసీసీఐ... ఆ తర్వాత నజరానాగా ప్రకటించిన రూ.125 కోట్ల చెక్కును అందించింది. బీసీసీఐ సెక్రటరీ జై షా ఈ చెక్కును అందించారు. టీమిండియా రోహిత్ శర్మ మాట్లాడుతున్నప్పుడు వాంఖడే దద్దరిల్లిపోయింది. రోహిత్ శర్మ తల్లిదండ్రులు కూడా తన కుమారుడు సాధించిన ఘనతను వాంఖడేలో ప్రత్యక్షంగా చూసి భావోద్వేగానికి గురయ్యారు.


జన సందోహం మధ్య ర్యాలీ

ఢిల్లీ నుంచి ముంబై చేరుకున్న క్రికెటర్లకు ఘన స్వాగతం పలికేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ముంబైలో ఎటుచూసినా త్రివర్ణ పతాకాలే రెపరెపలాడాయి. మువ్వన్నెల జెండాలను చేతపట్టిన అభిమానులు... భారత్‌ మాతాకి జై నినాదాలతో గర్జించారు. కనీవినీ ఎరుగని రీతిలో తరలివచ్చిన అభిమానులు జయహో భారత్‌ అంటూ నినదించారు. ఆ జన గర్జనలో సముద్ర ఘోష ఏ మాత్రం వినపడలేదు. నారిమన్‌ పాయింట్‌ నుంచి ముంబై వాంఖడే స్టేడియం వరకూ ఓపెన్‌ టాప్‌ బస్సులో టీమిండియా ఆటగాళ్లు.. భారీ జన సందోహం మధ్య ప్రయాణించారు. వాంఖడే స్టేడియంలో అభిమానులకు సన్మానం చేసిన అనంతరం బీసీసీఐ ప్రకటించిన రూ.125 కోట్ల నజరానాను అందించింది.

Tags:    

Similar News