CT2025: సెమీస్‌లో టీమిండియా
మరో మ్యాచ్ మిగిలి ఉండగానే నాకౌట్‌కు... రిక్తహస్తాలతో వెనుదిరిగిన పాక్;
ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్-ఎ సెమీస్ బెర్తులు తేలిపోయాయి. ఈ మెగా టోర్నీలో భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు చేరాయి. మార్చి 4, 5వ తేదీల్లో గ్రూప్ బీ నుంచి సెమీస్‌కు చేరిన జట్లతో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. లీగ్ మ్యాచ్‌లు విషయానికి వస్తే ఫిబ్రవరి 27న పాకిస్థాన్‌తో బంగ్లాదేశ్, మార్చి 2న న్యూజిలాండ్‌తో భారత్ నామమాత్రపు మ్యాచ్‌లు ఆడనున్నాయి. రెండేసి విజయాలతో భారత్, న్యూజిలాండ్ నాకౌట్‌కు దూసుకెళ్లగా.. ఆడిన రెండు మ్యాచ్‌లూ ఓడిన పాకిస్థాన్, బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్ గెలుస్తుందేమో అని దింపుడుకల్లం ఆశలతో ఉన్న పాకిస్థాన్‌కు.. ఆ కోరిక తీరలేదు. బంగ్లాతో మ్యాచ్‌లో కఠిన పరిస్థితులు ఎదురైనప్పటికీ, దృఢంగా నిలిచిన కివీస్.. తనతో పాటు భారత్ సెమీస్ బెర్తునూ ఖాయం చేసింది. 29 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సొంతగడ్డపై ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యమిస్తున్న పాకిస్థాన్.. రిక్తహస్తాలతో ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
న్యూజిలాండ్ ఘన విజయం
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 237 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 46.1ఓవర్లలో ఛేదించింది. బ్యాటింగ్‌లో రచిన్ రవీంద్ర (112)సెంచరీతో రాణించగా.. లాథమ్(55), కాన్వే(30), ఫిలిప్స్(21*) పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్, రాణా, రహ్మన్, లక్ష్యాన్ని న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో బంగ్లా గెలిస్తే రేసులో ఉండొచ్చనుకున్న ఆతిథ్య పాకిస్థాన్‌కు తీవ్ర నిరాశ తప్పలేదు. అవమానకర రీతిలో ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఛేదనలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌కు రచిన్ రవీంద్ర వెన్నెముకలా నిలిచాడు.
బంగ్లా గౌరవప్రదమైన స్కోరు
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బంగ్లా ఓపెననర్లు తంజిద్ హసన్ (24), నజ్ముల్ శాంటో తొలి వికెట్‌కు 45 పరుగులు జోడించారు. బ్రాస్‌వెల్ 9వ ఓవర్లో తంజిద్‌ను ఔట్ చేయడం ద్వారా బంగ్లా పతనాన్ని ఆరంభించాడు. అక్కడి నుంచి బంగ్లా క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకుంది. హృదోయ్ (7), ముష్ఫికర్ (2), మహ్మదుల్లా (4)లను ఔట్ చేసిన బ్రాస్‌వెల్.. బంగ్లా వెన్నువిరిచాడు. 118/5తో చిక్కుల్లో పడ్డ జట్టును.. జేకర్ అలీ (45; 55 బంతుల్లో 3×4, 1×6) సహకారంతో శాంటో ఆదుకున్నాడు. ఆరో వికెట్‌కు 45 పరుగుల జోడించాక శాంటో ఔటైనా జేకర్ చక్కని బ్యాటింగ్‌ను కొనసాగించాడు. రిషాద్ (26)తో ఏడో వికెట్‌కు 33, తస్కిన్ (10)తో ఎనిమిదో వికెట్‌కు 35 పరుగులు జోడించడంతో బంగ్లా 236 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది.