CT2025: తుది సమరానికి టీమిండియా సిద్ధం
అన్ని విభాగాల్లో పటిష్టంగా టీమిండియా... కివీస్‌తో కఠిన పోటీ తథ్యం;
ఛాంపియన్స్ ట్రోఫీలో తుది సమరానికి టీమిండియా సిద్ధమైంది. భీకర ఫామ్‌లో ఉన్న భారత జట్టు.. న్యూజిలాండ్‌తో ఫైనల్‌కు సమాయత్తమైంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా నేడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. మధ్యాహ్నం 2 గంటలకు టాస్ వేయనున్నారు. మ్యాచ్‌పై ఆసక్తి పెరిగింది. ఐసీసీ టోర్నమెంట్లలో న్యూజిలాండ్‌పై టీమిండియాకు కఠిన పోటీ ఉండగా, రోహిత్ శర్మ సేన ఈసారి విజయ యాత్రను కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఒకే మైదానంలో వరుస మ్యాచ్‌లు ఆడడం భారత జట్టుకు అనుకూలంగా మారనుంది.
ఇప్పుడు న్యూజిలాండ్ వంతు
భారత జట్టు 2023 వన్డే వరల్డ్ కప్ ఓటమికి ప్రతీకారంగా ఇప్పటికే ఆసీస్‌ను రెండుసార్లు ఓడించింది. 2024 T20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ రెండింట్లోనూ వారిని ఇంటికి పంపించింది. ఇప్పుడు న్యూజిలాండ్ వంతు.. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో కివీస్ చేతిలో ఓడిపోయాం. ఆ ఓటమి కోట్లాది మంది భారత అభిమానులను కంటతడి పెట్టించింది. 2021 WTC ఫైనల్లోనూ మనల్ని ఓడించిన న్యూజిలాండ్‌ను ఈసారి కచ్చితంగా మట్టికరిపించాలి.
రోహిత్ ఈ రోజైనా టాస్ గెలుస్తాడా..?
అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా వరుసగా 14 మ్యాచుల్లో టాస్ ఓడి పోయింది. భారత కెప్టెన్‌గా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా వరుసగా 11 సార్లు టాస్ ఓడిపోయాడు. CT ఫైనల్ పోరులో భారత్, న్యూజిలాండ్ నేడు తలపడనున్నాయి. దీంతో రోహిత్ శర్మ.. ఈరోజైనా టాస్ గెలుస్తాడా లేదా అనేదానిపై చర్చ జరుగుతోంది. ఈ టోర్నీ మొత్తంలో రోహిత్ కేవలం 41 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్ చెలరేగితే విజయం మనదే.
టాస్ గెలవకున్నా.. కప్ మనదే: అశ్విన్
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఫీవర్‌తో క్రికెట్ లవర్స్ ఊగిపోతున్నారు. దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు టాస్ అత్యంత కీలకమని మాజీ క్రికెటర్లు, అభిమానులు భావిస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా టాస్ గెలవకున్నా.. ఇండియా మ్యాచ్ గెలవగలదని అభిప్రాయపడ్డాడు. అటు లీగ్ మ్యాచ్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని న్యూజిలాండ్ కసితో ఉంది.