The Ashes: 132 పరుగులకే కుప్పకూలిన ఆస్ట్రేలియా
40 పరుగుల వెనుకంజలో కంగారులు
ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్‌లో ఆస్ట్రేలియా 45.2 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. కంగారూల జట్టు ఇప్పటికీ 40 పరుగుల వెనుకంజలో ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 172 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
పెర్త్ వేదికగా మొదలైన తొలి మ్యాచ్‌లో ఏకంగా 19 వికెట్లు పడ్డాయి. యాషెస్ సిరీస్ చరిత్రలో గడిచిన వందేళ్లలో ఇలా ఎప్పుడూ జరగలేదు. 2001 ట్రెంట్‌బ్రిడ్జ్ టెస్ట్‌లో అత్యధికంగా 17 వికెట్లు పడ్డాయి. యాషెస్ టెస్ట్ తొలి రోజు 18 అంతకంటే ఎక్కువ వికెట్లు పడిన ఏకైక ఉదంతం 1909 ఓల్డ్ ట్రాఫర్డ్ టెస్ట్‌లో చోటు చేసుకుంది. ఆ మ్యాచ్ తొలి రోజు రికార్డు స్థాయిలో 20 వికెట్లు పడ్డాయి. తొలుత ఆస్ట్రేలియా 147, ఆర్వాత ఇంగ్లండ్ 119 పరుగులకు ఆలౌటయ్యాయి.
యాషెస్ టెస్ట్‌లోనూ పునరావృతమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 172 పరుగులకు ఆలౌట్ కాగా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌పై మిచెల్ స్టార్క్ నిప్పులు చెరిగాడు. ఏకంగా 7 వికెట్లు తీసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను మట్టుబెట్టాడు. అరంగేట్రం పేసర్ బ్రెండన్ డాగ్గెట్ 2, గ్రీన్ ఓ వికెట్ తీశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (52) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఓలీ పోప్ (46), జేమీ స్మిత్ (33), డకెట్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. జాక్ క్రాలే, రూట్, మార్క్ వుడ్ డకౌట్లు కాగా.. స్టోక్స్ 6, అట్కిన్సన్ 1, కార్స్ 6 పరుగులకు ఔటయ్యారు. అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ బౌలర్లు సైతం విరుచుకుపడ్డారు. కెప్టెన్ స్టోక్స్ 5, ఆర్చర్, కార్స్ తలో 2 వికెట్లు తీసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను పతనం అంచుకు తీసుకెళ్లారు. ఆస్ట్రేలియా జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 39 ఓవర్లకు 9 వికెట్లు నష్టపోయి 123 పరుగులు చేసింది.
నిప్పులు చెరిగిన స్టార్క్
మొట్టమొదటి టెస్ట్‌లో ఆసీస్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ అసాధారణమైన బౌలింగ్‌తో చెలరేగిపోయాడు. తన టెస్ట్ కెరీర్లోనే బెస్ట్ స్పెల్‌ను వేసిన స్టార్క్ ఇంగ్లండ్ బ్యాటర్లను కార్డుల పేకమేడలా కూల్చేశాడు. స్టార్క్ బౌలింగ్‌లో పరుగులు చేయడం అటుంచితే, కనీసం నిలబడటానికి కూడా ఇబ్బంది పడ్డారు. స్టార్క్ సృష్టించిన 'నిప్పులు చెరిగే' బంతుల ధాటికి ఇంగ్లండ్ జట్టు రెండో సెషన్లోనే 172 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆస్ట్రేలియాకు చెందిన విధ్వంసకర ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఆ నిర్ణయాన్ని పీడకలగా మార్చాడు. మ్యాచ్ మొదటి రోజు నుంచే స్టార్క్ దాడి మొదలైంది. తొలి ఓవర్లోనే వికెట్ తీసి ఆస్ట్రేలియాకు అద్భుతమైన ఆరంభాన్ని అందించిన స్టార్క్, ఆ తర్వాత ఆగలేదు. లంచ్ సమయానికి మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ టాప్ ఆర్డర్‌ను నాశనం చేసిన స్టార్క్ రెండో సెషన్లో మరింత ఉగ్రంగా కనిపించాడు. ఈ సెషన్లో అతను కేవలం ఐదు వికెట్లే కాక.. మొత్తంగా 7 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేశాడు. 7 వికెట్లు తీయడం మిచెల్ స్టార్క్ టెస్ట్ కెరీర్లోనే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కావడం గమనార్హం.స్టార్క్ తన బౌలింగ్‌తో పెర్త్‌లో అక్షరాలా 'నిప్పుల గోళాలు' విసిరినట్లుగా కనిపించాడు.