OLYMPICS: ఇంత ఈజీగా మెడల్‌ గెలిచాడేంట్రా

సోషల్‌ మీడియాలో వైరల్‌గా టర్కీ షూటర్‌ యూసఫ్ తీరు;

Update: 2024-08-01 06:45 GMT

పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటింగ్‌ ద్వయం మను బాకర్-సరబ్‌జోత్ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో కాంస్య పతకం సాధించారు. అయితే, ఇదే కేటగిరీలో టర్కీ జోడీ యూసఫ్ డికెక్-సెవ్వల్ ఇలాదా తర్హాన్ రజతం దక్కించుకుంది. మరి ఇందులో ప్రత్యేక ఏముందంటారా? టర్కీ షూటర్‌ యూసఫ్ ఈ పోటీల్లో పాల్గొన్న తీరే అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ ఏ చేశాడంటే?

సాధారణంగా షూటింగ్‌ ఈవెంట్లలో క్రీడాకారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మెరుగైన కచ్చితత్వం కోసం సన్‌గ్లాసెస్‌, బయట నుంచి వచ్చే శబ్దాల నుంచి రక్షణ కోసం ఇయర్ ప్రొటక్టర్లను వాడుతుంటారు. కానీ, 51 ఏళ్ల టర్కీ షూటర్ యూసఫ్ మాత్రం ఇవేవీ పెట్టుకోకుండానే ఎయిర్‌ పిస్తోల్‌ విభాగంలో పాల్గొన్నాడు. తన పార్టనర్ తర్హాన్‌తో కలిసి రెండో స్థానంలో నిలిచి రజతం సాధించాడు. దీంతో డికెక్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలతోపాటు మీమ్స్‌ వెల్లువెత్తాయి. ప్రేక్షకుల్లో ఒకడిలా వచ్చి షూటింగ్‌లో పతకం కొట్టేయడం విచిత్రంగా ఉందని కొందరు వ్యాఖ్యానించారు. తొలిసారి 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో పోటీపడిన యూసఫ్‌కి ఇది ఐదో ఎడిషన్‌. కానీ, ఇదే అతడి మొదటి ఒలింపిక్‌ పతకం కావడం విశేషం. కెరీర్‌ ఆఖర్లో ఇలాంటి ఫీట్‌తో పతకం సాధించాడని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

టేబుల్‌ టెన్నిస్ ప్రపంచ నంబర్‌ వన్ ఆటగాడు వాంగ్‌ చుకిన్‌కు చేదు అనుభవం ఎదురైంది. చైనాకు చెందిన ఈ ఛాంపియన్ ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో ఓడిపోయాడు. అయితే, దీనికి కారణం అతడి బ్యాట్ విరిగిపోవడమేనని కొందరు అభిమానులు చెబుతున్న మాట. అంతకుముందు మిక్స్‌డ్‌ డబుల్స్‌లో స్వర్ణం గెలిచిన జట్టులో వాంగ్‌ ఉన్నాడు. ఆ సమయంలో తన పార్టనర్‌తో కలిసి ప్రేక్షకులకు అభివాదం చేస్తున్నాడు. అప్పుడు భారీగా ఫొటోగ్రాఫర్లు తోసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ఓ ఫొటోగ్రాఫర్ బ్యాట్‌ను తొక్కడంతో అది విరిగిపోయింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారిపోయింది. దీనివల్లే సింగిల్స్‌లో వాంగ్‌ ఓడిపోయాడనే చర్చా మొదలైంది.

Tags:    

Similar News