ఇండియా అండర్ 19 జట్టు, ఇంగ్లాండ్ అండర్ 19 జట్ల మధ్య జరుగుతున్న యూత్ వన్డే సిరీస్లో భారత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ రికార్డుల హోరు కొనసాగిస్తోంది. ఈ సిరీస్లో భారత్ అండర్ 19 జట్టు 5 వన్డేల సిరీస్లో మరో విజయాన్ని నమోదు చేసింది. మూడో వన్డేలో అద్భుతంగా రాణించిన టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడో వన్డేలో వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ దూకుడుగా ఆడి అర్థ సెంచరీ సాధించాడు. కేవలం 20 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసిన వైభవ్.. 31 బంతుల్లో 86 పరుగులు చేశాడు. ఈ క్రమంలో సురేష్ రైనా 21 ఏళ్ల రికార్డును వైభవ్ సూర్యవంశీ బ్రేక్ చేశాడు. అండర్ 19 క్రికెట్ చరిత్రలోనే 80 లేదా అంత కంటే ఎక్కువ పరుగులు చేసినప్పుడు అత్యధిక స్ట్రైక్ రేట్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు మొదటి స్థానంలో నిలిచాడు. వైభవ్ సూర్యవంశీ 31 బంతుల్లో 86 పరుగులు చేసినప్పుడు.. అతని స్ట్రైక్ రేట్ 277.41గా ఉంది.
దీనికి ముందు సురేష్ రైనా స్కాట్లాండ్ అండర్-19 జట్టుపై 2004లో ఆడిన మ్యాచ్లో 38 బంతుల్లో 90 పరుగులు చేశాడు. అప్పుడు సురేష్ రైనా స్ట్రైక్ రేట్ 236.84గా ఉంది. ఆ రికార్డును వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు బద్ధలుకొట్టాడు. అంతేకాకుండా.. భారత ఆటగాళ్లలో అత్యంత వేగంగా 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాల్గవ స్థానంలో వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. ఈ మ్యాచ్లో వైభవ్ 6 బౌండరీలు, 9 సిక్సర్లు కొట్టాడు. దీని ద్వారా ఒకే అండర్ 19 మ్యాచ్లో 9 సిక్సర్లు కొట్టిన మొదటి భారత ఆటగాడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు.