గుజరాత్ వికెట్ కీపర్ కం బ్యాటర్ ఉర్విల్ పటేల్ ధనాధన్ బ్యాటింగ్ తో సరికొత్త రికార్డ్ లిఖించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కేవలం 28 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. దీంతో భారత్ స్టార్ ఆటగాడు రిషభ్ పంత్ పేరిట ఉన్న వేగవంతమైన రికార్డును బ్రేక్ చేసి సంచలనం సృష్టించాడు. మధ్యప్రదేశ్ వేదికగా త్రిపుర జట్టుతో జరిగిన మ్యాచ్ లో 26 ఏళ్ల ఉర్విల్.. అసాధారణ ప్రతిభ కనబరిచాడు. గతంలో 32 బంతుల్లో పంత్ సెంచరీ చేశాడు. ఇప్పటివరకు టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా పంత్ పేరిట ఉన్న రికార్డును ఉర్విల్ తాజాగా బద్దలు కొట్టాడు.
క్రీజులోకి వచ్చిన తొలి బంతి నుంచే దూకుడైన ఆటతో.. 35 బాల్స్ లో ఏడు ఫోర్లు, 12 సిక్స్‌లతో 113 పరుగులు చేశాడు. గతేడాది చండీగఢ్ వేదికగా అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన విజయ్ హజారే ట్రోఫీలోనూ ఉర్విల్.. 41 బంతుల్లో 100 పరుగులు చేసి.. లిస్ట్-ఏ క్రికెట్ లో భారత్ తరఫున రెండో వేగవంతమైన శతకం బాదిన ఆటగాడిగా నిలిచాడు. కాగా.. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో అన్‌సోల్డ్ వికెట్‌కీపర్ బ్యాటర్‌గా ఉర్విల్ మిగిలాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన త్రిపుర 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. శ్రీదమ్ పాల్ 57 పరుగులతో రాణించాడు. ఇక 157 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి కేవలం 10.2 ఓవర్లలోనే గుజరాత్ ఛేదించింది.