ICC: ఆడాలంటే..భారత్ రావాల్సిందే
బంగ్లాదేశ్‌కు తేల్చిచెప్పిన ఐసీసీ... ప్రపంచకప్ కోసం భారత్ రావాల్సిందే.. లంకలో మ్యాచుల నిర్వహణ కుదరదు... భారత్ రావడం తప్ప మరో మార్గం లేదు
టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో భారత్..బంగ్లాదేశ్ మధ్య ఏర్పడిన వివాదం ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. భద్రతా కారణాలను చూపుతూ టోర్నీ వేదికను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలన్న బంగ్లాదేశ్ డిమాండ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. వేదిక మార్పుకు ఎలాంటి అవకాశమే లేదని, టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనాలంటే బంగ్లాదేశ్ జట్టు తప్పనిసరిగా భారత్‌కు రావాల్సిందేనని ఐసీసీ తేల్చి చెప్పింది. భారత్‌కు రాకపోతే మ్యాచ్‌లకు హాజరుకాకపోయినట్లుగా పరిగణించి పాయింట్లు కోల్పోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించినట్లు సమాచారం. తాజా నివేదికల ప్రకారం, ఇటీవల జరిగిన ఒక వర్చువల్ సమావేశంలో ఐసీసీ ఈ నిర్ణయాన్ని నేరుగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారులకు తెలియజేసింది. భద్రతా కారణాల పేరుతో భారత్ కాకుండా శ్రీలంకలో మ్యాచ్‌లు నిర్వహించాలన్న అభ్యర్థనను అంగీకరించబోమని స్పష్టం చేసింది. టోర్నీ షెడ్యూల్, లాజిస్టిక్స్, ప్రసార హక్కులు, భద్రతా ఏర్పాట్లు అన్నీ ఇప్పటికే ఖరారయ్యాయని, చివరి నిమిషంలో వేదిక మార్పు అసాధ్యమని ఐసీసీ తన వైఖరిని తేటతెల్లం చేసింది. అయితే ఈ విషయంపై బీసీబీ వర్గాలు భిన్నంగా స్పందిస్తున్నాయి. ఐసీసీ తమ అభ్యర్థనను తిరస్కరించిన విషయం తమకు అధికారికంగా ఇంకా తెలియలేదని, కేవలం మీడియా కథనాల ద్వారానే ఈ సమాచారాన్ని తెలుసుకున్నామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వర్గాలు చెబుతున్నాయి. అధికారిక లేఖ లేదా నోటీసు అందిన తర్వాతే తాము స్పందిస్తామని వారు పేర్కొనడం గమనార్హం. ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బంగ్లా క్రికెట్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.
భారత్-బంగ్లా వివాదం
ఐపీఎల్లో కోల్ కత్తా జట్టుకు ఆడాల్సిన బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ ను జట్టు నుంచి తొలగించారు. ఈ నిర్ణయం వెనుక బీసీసీఐ ఉందనే ప్రచారం జోరుగా సాగింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై భారత్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవడం, ఆ ప్రభావం క్రికెట్‌పై కూడా పడటం ఈ పరిణామాలకు దారితీసిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముస్తాఫిజూర్ రెహ్మాన్‌పై వ్యతిరేకత పెరిగిందని, పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకే అతడిని జట్టు నుంచి విడుదల చేసినట్లు సమాచారం. ఈ నిర్ణయం బంగ్లాదేశ్‌లో రాజకీయంగా కూడా పెద్ద దుమారం రేపింది.
ముస్తాఫిజూర్‌ను ఐపీఎల్ నుంచి తొలగించిన వ్యవహారంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా నేరుగా జోక్యం చేసుకుంది. భారత్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌ను బహిష్కరిస్తామని బంగ్లాదేశ్ ప్రభుత్వ వర్గాల నుంచి హెచ్చరికలు రావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ అంశంపై ఐసీసీకి అధికారికంగా లేఖ రాసిన బీసీబీ, తమ జట్టు భారత్‌లో మ్యాచ్‌లు ఆడదని స్పష్టం చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా తమ ఆటగాళ్లను భారత్‌కు పంపలేమని, కాబట్టి బంగ్లాదేశ్ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని కోరింది. బీసీబీ వాదన ప్రకారం, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో భారత్‌లో తమ ఆటగాళ్ల భద్రతపై అనుమానాలు ఉన్నాయని, ఆటగాళ్లకు పూర్తి భద్రత కల్పించలేని పరిస్థితి ఉంటే టోర్నీలో పాల్గొనడం కష్టమని తెలిపింది. ఇదే విషయాన్ని ఆధారంగా చేసుకుని వేదిక మార్పు డిమాండ్ చేసింది. ఐసీసీ మాత్రం ఈ వాదనలను పూర్తిగా తోసిపుచ్చినట్లు తెలుస్తోంది.