TRISHA: క్రికెట్ ప్రపంచంలో సరికొత్త సంచలనం త్రిష

తెలంగాణ బిడ్డపై ప్రశంసల జల్లు... అవార్డును తండ్రికి అంకితం చేసిన త్రిష;

Update: 2025-02-03 03:00 GMT

మహిళల ఐపీఎల్‌లో అమ్ముడుపోని తెలంగాణ అమ్మాయి త్రిష.. తన అద్భుత ఆటతీరుతో క్రికెట్ ప్రపంచం కళ్లు తెరిపించింది. అండర్ 19 ప్రపంచకప్‌లో శతకంతో సత్తా చాటి తన ఆటతీరుతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మెగా టోర్నీ అసాంతం అద్భుతంగారాణించిన త్రిష.. ఆల్‌రౌండ్‌ షోతో అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పటికే త్రిష ఆటతీరుపై మాజీలతో సహా అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. 2023లోనే మొట్టమొదటి అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత్‌ విజేతగా నిలవడంలో తన వంతు పాత్ర పోషించిన త్రిష.. ఈసారి అన్నీ తానై జట్టు టైటిల్‌ నిలబెట్టుకోవడంలో కీలకంగా మారింది. 7 ఇన్నింగ్స్‌ల్లో 77.25 సగటుతో 309 పరుగులు చేసిన త్రిష.. టోర్నీ టాప్‌స్కోరర్‌గా నిలిచింది. త్రిష ఆల్ రౌండ్ నైపుణ్యం ఆమెకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డునే కాదు... ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును కూడా అందించింది. ఈ వరల్డ్ కప్ లో త్రిష మొత్తం 309 పరుగులు చేసింది. బౌలింగ్ లో 7 వికెట్లు తీసి సత్తా చాటింది. అంతేకాదు, ఈ టోర్నమెంట్ లో నమోదైన ఏకైక సెంచరీ సాధించింది కూడా మన త్రిషనే.

తండ్రికి అంకితం

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ గ్రహీత, భారత మహిళల జట్టు మాజీ క్రికెటర్ నీతూ డేవిడ్ చేతుల మీదుగా త్రిష ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు అందుకుంది. ఈ అవార్డును తన తండ్రికి అంకితం ఇస్తున్నానని త్రిష ప్రకటించింది. తనను తాను ఎప్పుడూ ఆల్ రౌండర్ గానే భావిస్తానని పేర్కొంది. జాతీయ జట్టు తరఫున మరిన్ని మ్యాచ్ లు ఆడి, దేశం కోసం మరిన్ని విజయాలు సాధించాలనేదే తన లక్ష్యమని ప్రకటిచింది.


త్రిష అందరికీ గర్వకారణం: నారా లోకేశ్

మహిళల అండర్-19 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు. సమష్టి ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేశారని కొనియాడారు. టోర్నీ మొత్తం తనదైన బ్యాటింగ్, బౌలింగ్ తో అద్భుత ప్రదర్శన చేసిన తెలుగు క్రికెటర్ గొంగడి త్రిష అందరికీ గర్వకారణంలా నిలిచారని కితాబిచ్చారు. భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ప్రశంసలు

అండ‌ర్ -19 టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేతగా నిలిచిన టీమిండియా జ‌ట్టుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజ‌యం భార‌త‌దేశానికి ఎంతో గ‌ర్వకార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ, భద్రాచలం యువతి గొంగ‌డి త్రిష‌.. ఈ టోర్నీలో 300 ప‌రుగులు చేయ‌డ‌మే కాకుండా 10 వికెట్లు తీసి అద్భుత‌మైన ప్రద‌ర్శన కనబరిచారన్నారు. రాష్ట్రానికి గొప్ప పేరు తెచ్చారని త్రిషను ప్రశంసించారు.

Tags:    

Similar News