PAK: పాక్ సెమీస్ ఆశలు గల్లంతు!
మహా అద్భుతం జరిగితే తప్ప పాక్ కథ ముగిసినట్లే... అఫ్గాన్‌ది అదే కథ;
ప్రపంచకప్‌లో పాకిస్థాన్ పనైపోయింది. శ్రీలంకపై న్యూజిలాండ్ ఘన విజయం సాధించడంతో పాక్ సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. సెమీస్‌లో భారత్-పాక్ తలపడితే చూడాలని ఆశపడ్డ అభిమానులకు నిరాశే మిగిలింది. నాలుగో జట్టుగా నాకౌట్ చేరేందుకు కివీస్ మార్గం సుగమం చేసుకుంది. ఎందుకంటే పాకిస్థాన్ నాకౌట్‌లో అడుగుపెట్టాలంటే మహా అద్భుతమే జరగాలి. ఆ జట్టు సంచలనం కాదు అంతకుమించిన విజయాన్ని అందుకోవాలి. సెమీస్ చేరాలంటే పాక్ కనీసం 287 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించాలి. ఇప్పటివరకు ఆ జట్టు అతిపెద్ద విజయం 2016లో ఐర్లాండ్‌పై సాధించింది. 255 పరుగుల తేడాతో గెలిచింది. ఒకవేళ మ్యాచ్‌లో మొదట ఇంగ్లాండ్ 150 పరుగులకే పరిమితమైనా.. ఆ లక్ష్యాన్ని పాక్ కేవలం 3.4 ఓవర్లలోనే అందుకోవాలి.
ఆ అద్భుతం ఏంటంటే పాకిస్థాన్.. ఇంగ్లండ్ మధ్య శనివారం మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో తొలుత పాక్ బ్యాటింగ్ చేస్తే 287 పరుగుల తేడాతో భారీ విజయం సాధించాలి. అంటే పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేసి 300 పరుగులు చేస్తే.. ఇంగ్లండ్‌ను 13 పరుగులకే ఆలౌట్ చేయాలి. అలా కాకుండా పాకిస్థాన్ లక్ష్యాన్ని ఛేదించాల్సి వస్తే 284 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించాలి. అంటే ఇంగ్లండ్ 100 పరుగులకే ఆలౌటైనా... ఆ వంద పరుగులను పాకిస్థాన్ 22 బంతుల్లోనే సాధించాలి. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకూ ఎవ్వరికీ సాధించని గణాంకాలతో పాక్ విజయం సాధించాలి. కానీ ఈ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఎంత బలహీనంగా ఉన్న అంత ఘోరంగా ఓడిపోతుందని ఊహించడం కష్టమే. అందుకే ఈ మ్యాచ్‌లో గెలవాలంటే పాకిస్థాన్ ఇప్పటివరకూ చేయని అద్భుతమే చేయాలి. ఇలా జరగడం అసాధ్యం కాబట్టి పాక్ కథ ముగిసిందనే చెప్పాలి. మరోవైపు -0.338 రన్‌రేట్‌తో ఉన్న అఫ్గానిస్థాన్ సెమీస్ చేరాలంటే నేడు తమ చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై కనీసం 438 పరుగుల తేడాతో గెలవాలి.
పాకిస్థాన్ జట్టు సెమీస్ చేరాలన్న మార్గాలు మూసుకుపోవడంపై పాక్ క్రికెట్ టీమ్ డైరెక్టర్ మికీ ఆర్థర్ స్పందించాడు. ఇక అంతా దేవుడి చేతుల్లోనే ఉందంటూ నిర్వేదం వ్యక్తం చేశాడు. ఈ ప్రపంచకప్‌లో తాము సెమీస్‌కు చేరుకుంటామని ఆశిస్తున్నాననని అన్నాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్ రోజు అసలు ఏం జరుగుతుందో చూద్దామంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. సెమీస్ చేరేందుకు తమ వంతు ప్రయత్నిస్తామని తర్వాత అంతా భగవంతుడి దయంటూ వ్యాఖ్యానించాడు. తమకు ఆ దేవుడి దయ కూడా కావలంటూ ఆర్థర్ కామెంట్స్ చేశాడు. ఓపెనర్ ఫకర్ జమాన్ రాకతో బ్యాటింగ్ మరింత బలోపేతమైందని ఇంగ్లండ్‌పై భారీ తేడాతో గెలుస్తామని కూడా ఆశాభావం వ్యక్తం చేశాడు. లంకపై గెలుపుతో కివీస్ 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 10 పాయింట్లతో ఉంది. ఇప్పుడా జట్టు నెట్ రన్‌రేట్ 0.743. 8 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 8 పాయింట్లు, 0.036 రన్‌రేట్‌తో ఉన్న పాకిస్థాన్ తన చివరి మ్యాచ్‌లో శనివారం ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో పాక్ గెలిస్తే 10 పాయింట్లు ఖాతాలో చేరతాయి. కానీ కివీస్ నెట్ రన్‌రేట్‌ను దాటాలంటే కేవలం విజయం సరిపోదు.