WWC2025: టీమిండియా.. ప్రపంచ ఛాంపియన్
వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా చిత్తు.. 298 రన్స్ చేసిన టీమిండియా.. 246 పరుగులకే కుప్పకూలిన ప్రొటీస్
మహిళల ప్రపంచకప్‌లో భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. 47 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడారు. ముంబయి వేదికగా ఉద్విగ్నభరితంగా సాగిన ఫైనల్లో భారత జట్టు దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. షెఫాలీ వర్మ (87 పరుగులు, 2 వికెట్లు), దీప్తి శర్మ (58 పరుగులు, 5 వికెట్లు) బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ అదరగొట్టి భారత కీర్తిపతాకాన్ని రెపరెపలాడించారు. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో సౌతాఫ్రికాపై అద్భుతమైన విజయం సాధించింది. షెఫాలీ వర్మ, దీప్తి శర్మ అసాధారణ ప్రదర్శనతో అదరగొట్టిన వేళ.. సౌతాఫ్రికాకు ఓటమి తప్ప మరో మార్గం లేకుండా చేశారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు స్మృతి మంధాన (45), షెపాలీ వర్మ (87) అదిరే ఆరంభం అందించారు. అయితే ఆ తర్వాత వచ్చిన జెమీమా (24), హర్మన్‌ప్రీత్ (20), అమన్‌జోత్ (12) పెద్దగా రాణించలేదు. అయితే దీప్తి శర్మ (58), రిచా ఘోష్ (34) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 298/7 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే బలమైన సౌతాఫ్రికా ముందు ఈ స్కోరు సరిపోతుందా? అని అంతా అనుమానించారు. అసలే దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా అద్భుత ఫామ్‌లో ఉంది. సెమీఫైనల్లో భారీ శతకంతో ప్రొటీస్ జట్టును ఫైనల్ చేర్చింది. దీంతో టీమిండియా ఈ స్కోరును కాపాడుకోగలదా అనిపించింది. కానీ భారత బౌలర్లు అద్భుతమే చేశారు.
కట్టుదిట్టమైన బౌలింగ్..
భారీ ఛేజ్‌లో భారత బౌలర్లు చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. తొలి పవర్‌ప్లేలో సౌతాఫ్రికా బ్యాటర్లు భారీ షాట్లు ఆడకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే సఫారీ కెప్టెన్ లారా వోల్వార్ట్ (101) సెంచరీతో ఆకట్టుకున్నా.. బ్రిట్స్ (23), బాష్ (0), సూన్ లూస్ (25) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. వోల్వార్ట్ రాణించినా ఆమెకు సహకారం కరువైంది. డెర్క్సన్ (35) కొంత పోరాడినా దీప్తి శర్మ అద్భుతమైన డెలివరీతో ఆమెను క్లీన్‌బౌల్డ్ చేసింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన వారందరూ ఒత్తిడికి తలొగ్గారు. మారిజాన్ కాప్ (4), సినాలో జఫ్తా (16), క్లో ట్రయాన్ (9), ఖాఖా (1) అందరూ విఫలమయ్యారు. చివర్లో డి క్లర్క్ (18)ను అవుట్ చేసిన దీప్తి.. సఫారీల కథ ముగించింది. వన్డే వరల్డ్ కప్‌లో భారత్ ఆడిన తొలి మ్యాచులో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగి, ఒంటిచేత్తో జట్టును గెలిపించిన దీప్తి శర్మ మరోసారి అలాంటి ప్రదర్శనే చేసింది. వరల్డ్ కప్ ఫైనల్ వంటి కీలకమైన మ్యాచులో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు హాఫ్ సెంచరీతో మెరవడంతోపాటు.. ఏకంగా ఐదు వికెట్లు తీసి ప్రత్యర్థి వెన్ను విరిచింది. సెంచరీతో చెలరేగిన లారా వోల్వార్ట్, ప్రమాదకరమైన కాప్, జఫ్తా, డెర్క్సన్, డిక్లర్క్ అందర్నీ అవుట్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ఆమెకే ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు దక్కింది.