Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏసీబీ దర్యాప్తుకు రంగం సిద్ధం: సీబీఐకి అప్పగింత తర్వాత కీలక పరిణామం

Update: 2025-09-29 10:30 GMT

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఆర్థిక అవకతవకలు, బ్యారేజీల నిర్మాణంలో జరిగిన నష్టాలపై దర్యాప్తు విషయంలో తెలంగాణ సర్కార్ తీసుకున్న కీలక నిర్ణయం తర్వాత మరో ముఖ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రాజెక్టుపై CBI విచారణ జరిపించాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే.

సీఎం ప్రకటన నేపథ్యంలోనే, తాజాగా కాళేశ్వరం అక్రమాలపై ACB కూడా రంగంలోకి దిగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో జరిగిన నష్టంపై వెంటనే దర్యాప్తు జరపాలని కోరుతూ విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ సంచలన లేఖను ఏసీబీకి రాసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కాంట్రాక్టర్ల నుంచి బాధ్యులు ఎలా లబ్ధి పొందారో అనే అంశంపై సమగ్రంగా విచారణ జరపాలని ఈ లేఖలో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు విజిలెన్స్ రాసిన లేఖను ఏసీబీ డీజీ ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) రామకృష్ణా రావుకు పంపారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై ఏసీబీ విచారణ ప్రారంభించనుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) దర్యాప్తుతో పాటు, రాష్ట్ర సంస్థ ఏసీబీ కూడా విచారణ జరపడానికి సిద్ధమవుతుండడం ఈ కేసులో కీలకంగా మారింది.

Tags:    

Similar News