వరుస ఓటములతో గులాబీ పార్టీలో గుబులు పుట్టినట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా కంటోన్మెంట్ ఉపఎన్నిక, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ సీటులను కోల్పోవడం బిఆర్ ఎస్ పార్టీకి అతిపెద్ద దెబ్బ. ఓవైపు ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగిందని ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఈ రెండు సీట్లు కోల్పోవడం వల్ల.. ఇప్పటివరకు చేసిన ప్రచారం అంతా ఉత్తదే అయిపోయింది. దీంతో మాజీ సీఎం, గులాబీ పార్టీ అధినేత కెసిఆర్ చాలా లోతుగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ ఇలా ఎందుకు ఓడిపోతుంది, ఎక్కడ వైఫల్యం వచ్చింది అనే విషయాలపై కేసీఆర్ ఆరా తీస్తున్నారంట.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు జరిగిన పొరపాట్లను ఒక గుణపాఠంగా తీసుకొని ప్లాన్ రెడీ చేయాలని చెబుతున్నారంట. అందుకే ఇప్పటి నుంచే ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో కీలకమైన సర్వేలు చేయించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఏ అభ్యర్థులకు ప్రజల్లో బలం ఉంది, ఎవరు ప్రజల్లో తిరుగుతున్నారు అనే విషయాలపై కూడా ఆరా తీస్తున్నారు అంట. డబ్బులు ఉన్న నేతలకు, ఆల్రెడీ టికెట్లు ఇచ్చిన వారికి కాకుండా మెజార్టీ స్థానాల్లో కొత్తవారికి టికెట్లు ఇవ్వాలని కేసిఆర్ సూచించినట్లు తెలుస్తోంది.
అందులో భాగంగానే ఏ నియోజకవర్గంలో ఏ యువనేతకు ఎక్కువ పాపులారిటీ ఉంది లోకల్ గా ఎవరికి పట్టు ఉంది అనే విషయాలపై సర్వే చేయించాలని కేటీఆర్, హరీష్ రావుకు చెప్పారంట. కొత్త అభ్యర్థులను ఏ ప్రాతిపదికన తీసుకుంటున్నారో కూడా ప్రజలకు వివరించేలా ఉండాలన్నారు. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పార్టీ ఇమేజ్ కంటే, అభ్యర్థి ఇమేజ్ చాలా బలంగా పనిచేసింది కాంగ్రెస్ పార్టీకి. బిఆర్ఎస్ అదే మైనస్ అయింది. కాబట్టి ఈసారి పార్టీ ఇమేజ్ మాత్రమే సరిపోదు అని లోకల్ గా ఉండే బలమైన అభ్యర్థులకే ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని కేసిఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.