నేతల వలసలతో ఇప్పటికే సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీకి ( BRS ) మరో షాక్ తగిలేలా ఉంది. ఆ పార్టీ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్సీలు సైతం హస్తం తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. శనివారం సీఎం రేవంత్ వరంగల్ పర్యటన సందర్భంగా ఆయన సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సారయ్య భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చేరికలపై చర్చించారట. 2 రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.
రెండు నెలల క్రితమే సారయ్య కాంగ్రెస్‌లో చేరుతారని భావించారు. అయితే ఆయనతో పాటు ఒకేసారి 10 మంది భారాస ఎమ్మెల్సీలను చేర్చుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం, సీఎం భావిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై సారయ్యను సంప్రదించగా.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్‌రెడ్డితో చర్చించి ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. మాధవరెడ్డి మొదటి నుంచీ రేవంత్‌తో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. గతంలో రేవంత్‌రెడ్డి హాథ్ సే హాథ్ జోడో యాత్ర చేపట్టి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటించినా.. నర్సంపేటలో అడుగు పెట్టలేదు. శనివారం హనుమకొండ కలెక్టరేట్‌లో ఒక పక్క సీఎం సమీక్షలో ఉంటే.. హనుమకొండలోని తన స్వగృహంలో ఎమ్మెల్యే ఉండటం హాట్‌టాపిక్‌గా మారింది.