ASSEMBLY: మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ ఆమోదముద్ర... బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ఛాన్స్.. పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు పచ్చాజెండా
మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టసవరణ బిల్లులను తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే అవకాశముంది. తొలుత మున్సిపల్, తర్వాత పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టి చర్చించారు. అనంతరం ఆ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ బిల్లు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ.. ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు బిల్లుకు కూడా శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బిల్లు అమలుకు సభ సభ్యులంతా ఆమోదం తెలిపారు. దీంతో మున్సిపల్ చట్ట సవరణ బిల్లును ఆమోదించినట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ సభలో ప్రకటించారు. ఇక సభలో రిజర్వేషన్ల అంశంపైనా వాడీవేడీగా చర్చ సాగింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రతిపక్ష నేత కేటీఆర్ సైతం చర్చించారు. అంతకుముందు రిజర్వేషన్ల అంశంపై చర్చించేందుకు అన్ని పార్టీలు మద్దతు పలికాయి. అనంతరం మంత్రి సీతక్క పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్ బిల్లులకు మద్దతు తెలుపుతుందని కేటీఆర్ అన్నారు. డిక్లరేషన్ ఇవ్వడానికి బదులుగా డెడికేషన్ తో బిల్లులను చట్టాలుగా మార్చి చూపించాలని హితవు పలికారు. అంతకుముందు బిల్లులపై చర్చ సందర్భంగా మంత్రులు మాట్లాడారు. బీసీలు అంచెలంచెలుగా ఎదగాలని తమ ప్రభుత్వం కోరుకుంటోందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.
బీఆర్ఎస్ పూర్తి మద్దతు
మున్సిపల్, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లులకు భారత రాష్ట్ర సమితి పూర్తి మద్దతు తెలిపిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను తమ పార్టీ హర్షిస్తుందని చెప్పారు. శాసనసభలో మాట్లాడుతూ, ఈ బిల్లుపై కేంద్ర ప్రభుత్వంతో అఖిలపక్ష చర్చలు జరపాలని, అందుకోసం ప్రధానమంత్రితో సమావేశానికి సమయం కేటాయించాలని కోరారు. ‘మేము కూడా ఢిల్లీకి వచ్చి ఈ బిల్లుకు బలమైన మద్దతు ఇస్తాం’ అని స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి తెలంగాణ సాధించి వచ్చినట్లే, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లి బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడాలని సూచించారు. అవసరమైతే జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్ష చేయాల్సిన పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. బీసీల హక్కుల కోసం పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీకి నిజమైన కమిట్మెంట్, నిబద్ధత అవసరమని కాంగ్రెస్ పోరాడితే తాము మద్దతు ఇస్తామని కేటీఆర్ అన్నారు. బీసీ బిల్లుకు అసెంబ్లీలో మద్దతు తెలుపుతూ.. కేంద్రంలో ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు.