ఉద్యోగాలు చేస్తున్న పలువురు తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని, అటువంటి వృద్ధులకు ప్రభుత్వం అండగా నిలవాల్సి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల వేతనాల నుంచి నేరుగా వారి తల్లిదండ్రులకు ఖాతాలకు 10-15 శాతం జమ అయ్యే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. అస్సాంలో ఇప్పటికే అటువంటి పథకం అమలవుతోందని.. ఇతర రాష్ట్రాల్లో ఇంకా అటువంటివి ఏవైనా ఉంటే పరిశీలించి ఒక నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ట్రాన్స్‌జెండర్లకు ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో అవకాశం కల్పించామని....వారి సేవలను రవాణా, దేవాదాయ శాఖ, వైద్యారోగ్య శాఖలతో పాటు ఐటీ, ఇతర కంపెనీల సేవల్లో వినియోగించుకునేలా చూడాలని సీఎం ఆదేశించారు..
తెలంగాణ రైజింగ్‌లో..
తెలంగాణ రైజింగ్-2047 డాక్యుమెంట్‌లో చిన్నారులు, మహిళలు, దివ్యాంగులు, వయోవృద్దుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై విధానాలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. దివ్యాంగుల మధ్య వివాహాలు, వివిథ పథకాల్లో దివ్యాంగులకు ప్రోత్సాహాకాలు కల్పించే విషయంపై అధ్యయం చేసి వచ్చే క్యాబినెట్ సమావేశం నాటికి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు..