భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి పై పురుషోత్తమ పట్నం గ్రామస్తులు నిన్న దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. భద్రాద్రి రామయ్య కు చెందిన భూముల ఆక్రమణను అడ్డుకున్నందుకే ఈవో పై గ్రామస్తులు దాడి చేసినట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. ఈ దాడిలో గాయపడ్డ ఈవో రమాదేవిని ఆలయ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అయితే ఓ ప్రభుత్వ అధికారినీపై ఆక్రమణదారులు ఇలా బహిరంగంగా దాడికి దిగడం రాష్ట్రంలో సంచలనగా మారింది.
కాగా ఈ ఘటనను తెలంగాణ సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచి డిప్యూటీ కలెక్టర్ల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈవో పై దాడి ఒక హేయమైన చర్య అని పేర్కొంది. ఆలయ భూములకు రక్షణగా విధులు నిర్వహించే అధికారులకు ప్రభుత్వం భద్రత కల్పించాలని, దాడికి పాల్పడిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని TSDCA డిమాండ్ చేసింది.
పురుషోత్తపట్నంలో భద్రాద్రి రామాలయానికి 889.50 ఎకరాల భూమి ఉంది. భూములను దేవస్థానానికి అప్పగించాలని ఇప్పటికే ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను బేఖాతరు చేసి ఆక్రమణదారులు నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన ఈవోపై దాడి జరిగింది