Babli Gates Open : బాబ్లీ గేట్లు ఓపెన్.. బాసరలో గోదావరి పరవళ్లు

Update: 2024-07-02 06:41 GMT

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎగువ గోదావరిపై మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు. గోదావరి నదీ జలాల వాటాపై మహారాష్ట్ర-తెలంగాణతో గతంలో కుదిరిన ఒప్పందం మేరకు జులై ఒకటో తేదీ నుండి అక్టోబర్ 28 వరకు బాబ్లీ గేట్లు ఎత్తివేసి దిగువ తెలంగాణకు వదిలిపెట్టడం జరుగుతుందని ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఏటా జులై 1వ తేదీన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడం ఆనవాయితీగా వస్తోంది. సోమవారం త్రిసభ్య కమిటీ సమక్షంలో గేట్లు ఎత్తివేసి 0.2 టీఎంసీల నీటిని దిగువకు వదిలారు.

మహారాష్ట్రలో 14 బాబ్లీ గేట్లు ఎత్తివేయడం వల్ల వరద ఉధృతి గోదావరిలో మరింత పెరిగే అవకాశం ఉంది. నాందేడ్ ధర్మాబాద్ మీదుగా బాసర గోదావరిలోకి నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉండడంతో ఎస్సారెస్పీ, బాసర, నిర్మల్, ఖానాపూర్ దిగువ గోదావరి తీర ప్రాంతాలను అధికారులు సోమవారం అప్రమత్తం చేశారు. రైతులు నదీ తీర ప్రాంతంలో ఉండవద్దని, చేపలు పట్టేవారు గోదావరి తీరానికి వెళ్లవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

బాబ్లీ ప్రాజెక్టు వద్ద సోమవారం 14 గేట్లు ఎత్తి దిగువకు 0.2 టీఎంసీల నీటిని వదలడంతో దిగువ బాసర వద్ద సాయంత్రం గోదావరి పరవళ్లు తొక్కింది. అడుగంటిపోయిన గోదావరికి బాబ్లీ వరద నీరు చేరడంతో ఉప్పొంగి ప్రవహించింది. ఎస్ఆర్ఎస్పీ వైపు పరవళ్లు తొక్కుతోంది.

Tags:    

Similar News