BANDI SANJAY: "మార్వాడీ గో బ్యాక్ వెనుక కుట్ర"
కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు;
మార్వాడీ గో బ్యాక్ ఉద్యమంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మొదటి సారి స్పందించారు. మార్వాడీ గో బ్యాక్ పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు మొదలయ్యాయని ఆరోపించారు. యూసుఫ్‌గూడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో కలిసి తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. మార్వాడీ గో బ్యాక్ పేరుతో కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల నాయకులు డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. మార్వాడీలు వ్యాపారం చేసుకుంటే తప్పేముందని బండి సంజయ్ ప్రశ్నించారు. మార్వాడీలు ఏనాడూ అధికారం కోసం పాకులాడలేదని, తెలంగాణను దోచుకోలేదని, వ్యాపారాలు చేసుకుంటూ సంపదను సృష్టించారని తెలిపారు. హిందూ సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నారని, అలాంటి మార్వాడీలు తెలంగాణ నుంచి ఎందుకు వెళ్లిపోవాలని ప్రశ్నించారు. హిందూ కుల వృత్తులను దెబ్బతీసేలా మటన్ షాపులు, డ్రై క్లీనింగ్ షాపులను ఒక వర్గం వారే నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.
"ఓట్ చోరీ వల్లే కాంగ్రెస్ గెలిచిందా.?”
ఓట్ల చోరీకి, బీజేపీకి అసలు సంబంధమేంటని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. తాము ఓట్ల చోరీ చేస్తే తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచేదా? అని నిలదీశారు. హైదరాబాద్ యూసుఫ్‌గూడలో బీజేపీ కేంద్ర జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీలో బీజేపీ తెలంగాణ చీప్ రామచంద్రరావుతో కలిసి బండి సంజయ్ పాల్గొన్నారు. ‘‘ ఓట్ల చోరీ జరిగితే.. ఇండి కూటమికి 230 ఎంపీ సీట్లు వచ్చేవా? భాజపాకు 240 ఎంపీ సీట్లు మాత్రమే ఎందుకు వస్తాయి? ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అందుకే కాంగ్రెస్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారింది’’ అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.