BATHUKAMMA: ప్రజా ఐక్యతకు నిదర్శనం బతుకమ్మ
బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్... ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలన్న కేసీఆర్
ఆడబిడ్డల ఆత్మగౌరవ అడ్డ.. ఓరుగల్లు గడ్డ మీద నేటి నుంచి బతుకమ్మ సంబురాలు షురూ కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలు వరంగల్ పట్టణంలోని వెయ్యి స్తంభాల గుడిలో ప్రారంభం అవనున్నాయి.ఆరంభ వేడుకల్లో రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ధనసరి అనసూయ సీతక్క పాల్గొననున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం ఈ ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. సకల జనులు, సబ్బండ వర్ణాలు కలిసి ఐక్యత స్ఫూర్తిని చాటేలా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు రూపొందిందన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూలను పూజించడం, ప్రకృతిని ఆరాధించడం ద్వారా మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ బతుకమ్మ, తెలంగాణ సంస్కృతి మరియు సాంప్రదాయాలకు ప్రత్యేక స్థానం కలిగిందని సీఎం రేవంత్ చెప్పారు. సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తూ, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకగా బతుకమ్మను ప్రతి ఒక్కరు సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ సామూహిక జీవన విధానం, కష్టసుఖాలను పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనమని ముఖ్యమంత్రి వివరించారు. ఎంగిలిపూల నుండి సద్దుల వరకూ, తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఆటలతో పండుగ వైభవంగా జరగాలని, రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని గౌరమ్మను సీఎం రేవంత్ రెడ్డి ప్రార్థించారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ తొమ్మిది రోజుల ఉత్సవాలను రాష్ట్ర ప్రజలందరూ ఆటపాటలతో ఘనంగా నిర్వహించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల ఐక్యతకు, కష్టసుఖాలను కలిసి పంచుకునే వారి సామూహిక జీవన విధానానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని గౌరమ్మను ప్రార్థించినట్లు వెల్లడించారు. గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ సైతం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గౌరీమాత అందరికీ ఆయుష్షు, ఆరోగ్యం ఇవ్వాలని ఆకాంక్షించారు.
వెలుగులు నింపాలి
కష్టాల నుంచి రక్షించి రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని బతుకమ్మను భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రార్థించారు. ప్రజలకు పూల పండగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అస్తిత్వం, సాంస్కృతిక జీవనానికి బతుకమ్మ ప్రతీకగా నిలిచిందన్నారు. ప్రపంచ సంస్కృతీ, సాంప్రదాయాల్లో తెలంగాణ ప్రత్యేకతను చాటుతోందని చెప్పారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ అస్తిత్వ ఆకాంక్షలకు ప్రధాన సాంస్కృతిక వేదికగా నిలిచిందని గుర్తుచేసుకున్నారు. పూలను కొలిచే విశిష్టమైన సంస్కృతి తెలంగాణ సొంతం. భగవంతుడిని పూలతో పూజిస్తాం.. అదే పూలను భగవంతుడిగా కొలుస్తూ.. 9 రోజుల పాటు ఆడపడుచులు బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకుంటారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఘనంగా, అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ నిర్వహిస్తారు. మొదటి రోజు 2025 సెప్టెంబర్ 21 ఎంగిలి పూల బతుకమ్మ నుంచి చివరి రోజు సద్దుల బతుకమ్మ వరకు ఏ ఊరు చూసినా సంబరాల్లో మునిగితేలుతుంటుంది.