తెలంగాణ రాష్ట్రాన్ని 109 రోజుల్లో చుట్టేసిన భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కాంగ్రెస్ లో సరికొత్త ఊపు తీసుకువచ్చింది. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఆరోగ్యం క్షీణించిన లెక్కచేయకుండా భట్టి విక్రమార్క తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలని నిర్విరామంగా 1350 కిలోమీటర్లు కొనసాగించిన ఈ యాత్రకు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభించి సక్సెస్ కావడం అధికార పార్టీలో ఇప్పుడు ఆందోళన మొదలైందని కాంగ్రెస్ పార్టీ అంటోంది.
ఇక తెలంగాణకు దిక్సూచిగా మారిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీ ని అధికారానికి చేరువ చేయడానికి దోహదపడడంతో ఇతర పార్టీల నాయకులు చేయి అందుకోవడానికి సిద్ధమయ్యారు.పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మంలో ఇవాళ నిర్వహించే తెలంగాణ జనగర్జన సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, గురునాథ్ రెడ్డి లాంటి నాయకులు కాంగ్రెస్‌లో చేరుతుండటమే ఇందుకు నిదర్శనమని హస్తం పార్టీ తెలిపింది.
భట్టి విక్రమార్క పాదయాత్రతో తెలంగాణ కాంగ్రెస్‌కు గ్రాఫ్ పెరిగింది. భట్టి పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమవుతున్న తీరు దివంగత వైఎస్సాఆర్ ను తలపిస్తుండటంతో క్షేత్రస్థాయి నుండి ప్రజలు మళ్లీ కాంగ్రెస్ కి పట్టం కట్టేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి చేస్తుందో చెప్పుకుంటూ వెళ్ళడం ఆయన రాజకీయ నిబద్ధతకు నిదర్శనం.ఇందిరమ్మ రాజ్యం రావాలి.. ఇంటింటా సౌభాగ్యం నెలకొనాలని.. నాటి వైఎస్సార్ బాట లోనే భట్టి విక్రమార్క ప్రజల కష్టాలను వింటూ వారికి కాంగ్రెస్ పార్టీ ఉందనే భరోసాను కల్పిస్తూ భట్టి పాదయాత్ర కొనసాగింది.
ఇక దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్ రాజశేఖర్ రెడ్డి ప్రజాప్రస్థానం పాదయాత్రలో రైతుల ఆత్మహత్యలకు గల కారణాలను తెలుసుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం ఉచిత కరెంటుపై చేసి రైతు సంక్షేమం.కోసం అనేక పథకాలు తీసుకువచ్చిన తరహాలోనే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తన పాదయాత్రలో పోడు భూములు, ధరణి సమస్యలతో ఎదుర్కొంటున్న రైతులు ఇబ్బందులను నేరుగా తెలుసుకోవడంతో పాటు ఆ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో కూడా గట్టిగా చెప్పి తెలంగాణ కాంగ్రెస్ పూర్వ వైభవానికి బాటలు వేశారు. అనేక రకాల సమస్యలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాటిని పరిష్కారిస్తామన్న భరోసాను భట్టి ప్రజల్లో కల్పించి రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ వైపు చూసేలా చేశారు.
గిరిజనులు,ఆదివాసీలు,బడుగు,బలహీన వర్గాలు,మైనారీటీలు,అట్టడుగు వర్గాలు, అణగారిన ప్రజలు భట్టి విక్రమార్కను జన నాయకుడిగా పేర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలుపు తీరాలకు చేర్చే చుక్కానిలా భట్టి విక్రమార్క పాదయాత్ర సాగింది. గతంలో కాంగ్రెస్ పార్టీకి దూరమైన బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ, వర్గాలు తిరిగి పార్టీకి దగ్గర చేయడంలో భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర విజయం సాధించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.